గుంటూరు: విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును అడ్డుకుని ప్రభుత్వం సాగించిన దారుణ కాండను ప్రజలంతా చూశారని... 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కక్షపూరితంగా అడ్డుకోవడం క్షమించరాని నేరమని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రమయ్య మండిపడ్డారు. 

గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుపై జరిగిన దాడి ప్రభుత్వం చేయించిన దాడేనని, అందుకు శ్రీకారం జగన్మోహన్ రెడ్డి ఇంటిలోనే జరిగిందని రామయ్య తెలిపారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 10 రోజుల క్రితమే తాను విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఆయన హోదాకు, గౌరవానికి తగ్గట్టు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎందుకు ఆ విషయాన్ని విస్మరించిందన్నారు. 

చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని మంత్రులు, వైసీపీ కార్యాలయం నుంచి ప్రకటన వచ్చినా ప్రభుత్వం(పోలీసులు) ఎందుకు పెడచెవిన పెట్టిందని రామయ్య నిలదీశారు. చంద్రబాబు పర్యటన దృష్టా విశాఖలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి, ముందు జాగ్రత్తగా వైసీపీ నేతలు, మంత్రులను గృహ నిర్భందం చేయకుండా ఎందుకు వదిలేశారో చెప్పాలన్నారు. పర్యటనను అడ్డుకుంటామన్నవారిని వదిలేసి ఇరు వర్గాల వారు విమానాశ్రయంలోకి చొచ్చుకొస్తున్నా పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషించారో, ఎవరి ఆదేశాలతో అలా వ్యవహరించారో సమాచారం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. 

జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల హక్కులు కాలరాయబడ్డాయని, ప్రజా స్వామ్యం చచ్చిపోయిందని, రాజ్యాంగం పక్కకు నెట్టబడిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించడంలో విఫలమైన అసమర్థ ప్రభుత్వాన్ని, వైసీపీ మూకలను నిరోధించలేని దద్ధమ్మ ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇలానే చేసుంటే, ఆయన జనంలో తిరగగలిగేవాడా అని రామయ్య ప్రశ్నించారు. 

సిగ్గు, లజ్జ లేని పరిపాలన రాష్ట్రంలో సాగుతోంది కాబట్టే వైసీపీ ముష్కర మూకలు చంద్రబాబును అడ్డుకున్నాయన్నారు. ప్రజాస్వామ్య విలువలు లేని జగన్ పాలనలో ప్రతిపక్ష నేత వాహన శ్రేణిపై చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసరడం దుర్మార్గమన్నారు. జగన్ పాదయాత్రలో ఆయనపై ఏనాడైనా ఇలాంటివి విసరడం జరిగిందా అని రామయ్య ప్రశ్నించారు. పనికిమాలిన పాలనా యంత్రాంగం రాష్ట్రంలో సాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనమేముంటుందన్నారు. పసుపు రంగు చీరలు కట్టుకోమని చెప్పి రూ.500 ఇచ్చి కిరాయి వ్యక్తులను తీసుకొచ్చి చంద్రబాబు పర్యటనకు వైసీపీ ప్రభుత్వం అవాంతరాలు  సృష్టించిందన్నారు.

read more  చంద్రబాబుపై కార్యకర్తలను ఉసిగొల్పింది మంత్రులే...: అమర్‌నాథ్ రెడ్డి

కోడిగుడ్లు, చెప్పులు, టమాటాలు విసరడం, రోడ్లపై పడుకోవడం, పెద్ద పెద్ద కేకలు వేయడం, నడి రోడ్డుపై రా... తేల్చుకుందామంటూ సవాళ్లు విసరడం, చంద్రబాబును అడ్డగించడం వంటి చర్యలు రాబోయే రోజుల్లో విశాఖ వినాశనానికి సంకేతాలనే విషయాన్నిఆ  నగర వాసులు గ్రహించాలన్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ముసుగులో జగన్మోహన్ రెడ్డి చూపించబోయే సినిమాకి నేడు జరిగింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుంటుందని విశాఖ వాసులు తెలుసుకోవాలన్నారు. జగన్ విశాఖలో  అడుగు పెట్టాక నేడు విసరబడిన చెప్పులు, రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు... బాంబులు, కాటా కత్తులుగా మారుతాయని రామయ్య హెచ్చరించారు. 

జగన్ విశాఖలో ఉంటే ప్రజలు ఎంతటి భయ భ్రాంతులతో జీవించాల్సి ఉంటుందో చెప్పడానికి ఇప్పడు జరిగింది చిన్న ఉదాహరణ మాత్రమేనన్నారు. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి తన తాత సాంప్రదాయాన్ని పులివెందుల ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని చూపించబోతున్నాడన్నారు. విశాఖలో శాంతి స్థానంలో అశాంతి మొదలైందని, మున్ముందు ప్రజలకు మనశ్శాంతి కరువవడం ఖాయమని వర్ల తెలిపారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను ఉత్తి పుణ్యానికే నిర్భందించే పోలీసులు, విశాఖలో ఇంత జరుగుతున్నా వైసీపీవారిని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు.  

చంద్రబాబు పర్యటనను అడ్డుకునే క్రమంలో అధికారులు, మంత్రులతో సమావేశం నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి వారికేం ఆదేశాలిచ్చాడో వెంటనే బయట పెట్టాలని టీడీపీ నేత డిమాండ్ చేశారు. క్రిమినల్ మనస్తత్వం ఉన్న వ్యక్తి పరిపాలిస్తుంటే, రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయనడానికి విశాఖ ఘటనే రుజువన్నారు. ఈర్ష్యా, ద్వేషాలతో కొట్టుమిట్టాడుతున్న జగన్ ప్రభుత్వం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అనుకున్నది సాధించాలని చూస్తోందని, అధికార పార్టీ తప్ప మరేపార్టీ రాష్ట్రంలో ఉండకూడదన్న కుత్సితత్వంతో, రాక్షస ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 

ప్రతిపక్ష నేత కాన్వాయ్ పై చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసిరితే చేవలేని, చేతగాని ప్రభుత్వం ఏంచేస్తోందని రామయ్య నిలదీశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంది టీడీపీవారేనన్న దుష్ర్పచారం చేయడానికే పసుపు చీరలు ధరింపజేసి, కిరాయి మనుషులను తీసుకొచ్చి వైసీపీ వారు విశాఖ విమానాశ్రయంలో వీరంగం సృష్టించారన్నారు. ఇటువంటి దుర్మర్గపు ఆలోచనలు నేర స్వభావం ఉన్నవారికే వస్తాయన్నారు. కేబినెట్ మంత్రిగా ఉన్న బొత్స సిగ్గు లేకుండా చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలంటూ, ప్రజా స్వామ్యానికి విరుద్ధంగా మాట్లాడినా జగన్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకులేకపోయిందన్నారు. 

రాజ్యాంగాన్ని రక్షిస్తానని ప్రమాణం చేసిన మంత్రి విశాఖనగరమేదో తన తాత సొత్తయినట్లుగా మాట్లాడుతుంటే, జగన్ సర్కారు ఏం చేస్తోందన్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో మంత్రి బొత్స ఇప్పటికే భూకబ్జాలు, దందాలు, దోపిడీలు ఆరంభించాడన్నారు. కడివెడు పాలల్లో విషపుచుక్క వేసినట్లుగా, సుందరమైన నగరాన్ని, శ్మశానంగా మార్చేందుకు వైసీపీప్రభుత్వం పాకులాడుతోందని రామయ్య దుయ్యబట్టారు. నేడు విశాఖలో జరిగిన ఘటన, జగన్ పరిపాలనలో ఒకబ్లాక్ డే అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. 

read more   ఆ సంఘటనే చంద్రబాబును అడ్డుకోడానికి కారణం...: కళా వెంకట్రావు

బీహార్ లో కూడా ఇటువంటి పరిపాలన చూడలేదని హైకోర్టు వ్యాఖ్యానించినా కూడా ఖాతరు చేయకుండా ముందుకెళ్లడం ఎటువంటి పరిపాలనో జగన్ సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్నపాలన మహిళలపై ఇనుపపాదాలు మోపడానికి, ప్రశ్నించినవారిని అరెస్ట్ చేయడానికి, తప్పుడు కేసులుపెట్టడానికి, ప్రతిపక్షనేతను అడ్డుకోవడానికి తప్ప, ప్రజలకు మేలు చేయడానికి పనికిరావడంలేదన్నారు. జగన్ పాలన ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడానికి, దోపిడీలు, కబ్జాలు సాగించడానికి పనికొచ్చేదిగా ఉందన్నారు. 

జగన్ పాలనపై ప్రజలంతా ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. విశాఖ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తారా అన్న విలేకరులు ప్రశ్నకు సమాధానంగా రామయ్య మాట్లాడుతూ, ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగతే పోలీసులకు చెబుతామని, పోలీసులే ఇబ్బందిపెడితే ఎవరికి చెప్పుకుంటామని, డీజీపీకి ఎన్నిఫిర్యాదులు చేసినా పరిస్థితి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉంది తప్ప మార్పులేదన్నారు. డీజీపీ సమదృష్టితో వ్యవహరించడం లేదని, ఆయన చట్టబద్ధంగా వ్యవహరిస్తే చంద్రబాబు ఇంటికి తాళ్లెందుకు కట్టాల్సి వస్తుందని రామయ్య నిలదీశారు. 

విశాఖలో వైసీపీ కిరాయి మూకలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయబోతున్నాయని తెలిసికూడా డీజీపీ మౌనంగా ఉన్నాడని, అటువంటి వ్యక్తికి ఏం చెప్పినా ఉపయోగమేముంటుందని వర్ల వాపోయారు. రాష్ట్రంలో ఇటువంటి నిస్సహాయ, అసహాయ డీజీపీని తానెప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను జగన్ ప్రభుత్వం నుంచి దేవుడే కాపాడాలి తప్ప ఏ వ్యవస్థలు కాపాడలేవని వర్ల తేల్చిచెప్పారు.