మచిలీపట్నం: స్నాచింగ్ కేసులో నేరస్తుడిని పట్టుకునేందుకు సహకరించిన యువకునికి జిల్లా ఎస్పి రివార్డు అందజేశారు.   వివరాల్లోకి వెళితే... పెనుగంచిప్రోలు మండలం, జొన్నలగడ్డ క్రాస్ రోడ్ వద్ద సుమారు 60 సంవత్సరాలు ఉన్న ఒక వృద్ధురాలు రోడ్డుపై నడిచి వెళుతుండగా, ఆ వృద్ధురాలిని తన బైక్ పై గమ్యస్థానం చేరుస్తానని నమ్మ బలికాడు ఓ వ్యక్తి. 

బైక్ ఎక్కించుకుని కొంతదూరం తీసుకు వెళ్ళాక, ఆమెను దింపేసి ఆమె మెడలో ఉన్న సుమారు 30 గ్రాముల బంగారు నాన్ తాడు లాక్కుని బైకుపై ఉడాయించాడు. అదే ప్రాంతంలో సీసీ కెమెరాల ఆపరేటర్ గా పని చేస్తున్న యువకుడు వంశీ  జరిగిన స్నాచింగ్ ను గమనించి, వెంటనే పెనుగంచిప్రోలు పోలీసువారికి సమాచారం అందజేశాడు.

 తాను చెప్పిన ఆధారాల ప్రకారం బైక్ నెంబరు, వ్యక్తి గుర్తులను  తెలుసుకున్న పోలీసులు  స్నాచింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా , స్నాచింగ్ చేసింది తానేనని అంగీకరించాడు. 

ఇదిలా ఉండగా జగ్గయ్యపేట పరిధిలో స్నాచింగ్కు పాల్పడి గతంలో 38 గ్రా బంగారు ఆభరణాలను అపహరించాడని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. మొత్తంగా ఈ రెండు కేసులలో అతని వద్దనుండి 68 గ్రాములు బంగారు ఆభరణాలు, సుమారు రెండు లక్షల 80 వేల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని గోపీనాథ్ను అరెస్టు చేశారు.  

చైన్ స్నాచింగ్ చేసిన నిందితుడిని పోలీసు పట్టుకోవడానికి సహకరించిన యువకుడు వంశీని శనివారంనాడు జిల్లా ఎస్పీ విజయవాడ క్యాంపు కార్యాలయంలో అభినందించి అతనికి నగదు రివార్డును అందజేశారు. 

ఇదే విధంగా యువకులు సమాజంలో తమ కళ్ల ముందు జరిగే అన్యాయాలను, అక్రమాలను పోలీసువారికి తెలియజేసి నేరాలు నియంత్రణలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.