విజయవాడ: రాష్ట్ర సమస్యలు, ప్రజల ఆందోళనలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి, మంత్రులు చంద్రబాబుపై, ఆయన కుటుంబసభ్యులపై నిందారోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీదాడుల గురించి, గత నాలుగురోజులుగా నిర్విరామంగా దుష్ర్ఫచారం చేస్తున్నారని ఆరోపించారు. 

సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సూట్ కేస్ కంపెనీల ద్వారా లక్షలకోట్లు పోగేసుకొని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ధైర్యం మంత్రులకు లేదు కానీ టీడీపీపై మాత్రం విషం చిమ్ముతున్నారని వెంకన్న దుయ్యబట్టారు. శ్రీనివాస్ ఇంటిలో ఏ సూట్ కేసులు దొరకలేదని ఐటీశాఖే స్పష్టంగా చెప్పిందని... కానీ రూ.2వేలకోట్లు దొరికాయని విష ప్రచారం చేస్తున్న వైసీపీనేతలు, మంత్రులు తమ తలలు ఎక్కడ పెట్టుకుంటారని ఆయన నిలదీశారు. 

read more  వైసిపి బాషలోనే ''నీ అమ్మ మొగుడెవరు'': జగన్ పై విరుచుకుపడ్డ నారా లోకేష్

రూ.2వేలకోట్లు దొరికాయని, ఆ సొమ్మంతా చంద్రబాబునాయుడిదేనని  గగ్గోలు పెట్టిన వైసీపీ బృందం ఆ మొత్తంసొమ్ము ఎక్కడుందో చూపాలని వెంకన్న డిమాండ్ చేశారు. సింగిల్ బెడ్ రూమ్ ఇల్లున్న శ్రీనివాస్ ఇంట్లో  ఆ రూ.2వేలకోట్లు ఎక్కడ దాచారో, వైసీపీనేతలే చెప్పాలన్నారు. వైసీపీ చెబుతున్న రూ.2వేలకోట్లు ఉంచడానికి వెయ్యి సూట్ కేస్ లు కావాలని,  శ్రీనివాస్ ఇంటిలో ఐటీవారికి ఒక్క సూట్ కేస్ కూడా దొరకలేదన్నారు. 

లక్షరూపాయలు, కోటి రూపాయల నోట్లు ఏవైనా జగన్ ముద్రించినట్లయితే అప్పుడు రూ.2వేలకోట్లను తేలికగా దాచవచ్చన్నారు. చంద్రబాబు సమాజం గురించి ఆలోచిస్తుంటే, జగన్ సమాజనాశనం గురించి ఆలోచిస్తూ శ్మశానం చేయాలని చూస్తున్నాడన్నారు. 

జగన్ తన అక్రమ సంపాదనను ఇడుపులపాయ, లోటస్ పాండ్, బెంగుళూరు ప్యాలెస్ లలో దాచి ఉంచాడని... ఆ సొమ్ములో ఈడీ జప్తుచేసింది  కేవలం రూ.43వేలకోట్లేనని, ఇంకా చేయాల్సిన సొమ్ము లక్షలకోట్ల వరకు ఉందన్నారు. ఎన్నికల ముందు రావాలి జగన్... కావాలి జగన్ అన్నవారే ఇప్పుడు, పోవాలి జగన్... జైలుకుపోవాలి జగన్ అంటున్నారని బుద్దా ఎద్దేవాచేశారు. 

అడ్డగోలుగా ప్రజలసొమ్ము తినడానికే జగన్ రాజకీయపార్టీ పెట్టాడని... అధికార పీఠాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్లు ఎలా దోచేయాలనేదాని గురించే ఆయన ఆలోచిస్తున్నాడని వెంకన్న తేల్చిచెప్పారు. వైసీపీ కార్యకర్తలే జగన్ పాలనచూశాక పోవాలి జగన్....పోవాలి జగన్ అనే పల్లవి పాడుతున్నారని, జగన్ చేస్తున్న పనులు అలాంటి స్థితిని కల్పించాడన్నారు. 

read more  సాక్షిలో నా వార్తలు రావు, కులమే అడ్డమా: వైఎస్ భారతికి వర్ల రామయ్య ప్రశ్న

విజయ్ మాల్యా తన మనసు మార్చుకొని ప్రజలసొమ్ముని తిన్నందుకు బాధపడుతూ దాన్ని తిరిగిచ్చేయడానికి ముందుకొచ్చాదని, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ లో మాత్రం ఎక్కడా మచ్చుకైనా పశ్చాత్తాపం కనిపించడంలేదన్నారు. చరిత్రలో చూసినట్లయితే చాణక్య-చంద్రగుప్తులు ప్రజలకు మేలుచేయడానికి, వారి సంక్షేమం, సంతోషం కోసం పనిచేస్తే, జగన్-విజయసాయిరెడ్డి మాత్రం రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి.. ప్రజల్ని ఎలా నాశనం చేయాలన్నదాని గురించే నిత్యం ఆలోచిస్తున్నారని వెంకన్న దుయ్యబట్టారు. 

తన పైశాచిక ఆనందం కోసం సమాజాన్ని భయపెట్టి, బతకడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడన్నారు.  జగన్ పాలనతో విసిగి, వేసారిన జనమంతా  రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశానికే ఓటేయాలనే దృఢసంకల్పంతో ఉన్నారని వెంకన్న స్పష్టంచేశారు.