గుంటూరు: హైపవర్‌ కమిటీ ఉత్తుత్తి, పవర్‌లేని కమిటీ అని మరోసారి స్పష్టమైందని టీడీపీ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో రాజధాని రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఆన్‌లైన్‌లో  వివరాలు ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం, అభిప్రాయాలు వెలువరించే ఆన్‌లైన్‌సైట్‌ పనిచేయకుండా చేసిందని ఆరోపించారు. 

శుక్రవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏది అడిగినా తమకేమీ తెలియదని చెబుతున్న మంత్రులు ఎందుకు తమ పదవుల్లో కొనసాగుతున్నారో చెప్పాలన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి నవ్వుతూనే ప్రజల కళ్లలో కారం కొడుతున్నాడని వెంకన్న మండిపడ్డారు. మంత్రులకు తమశాఖలపై పట్టులేదని, అందుకే వారెవరూ ప్రజలముందుకు రావడంలేదన్నారు. 

ముఖ్యమంత్రి ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే మంత్రులంతా మూగనోము పట్టారన్నారు. రాజధాని రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అక్కడ ఏవిధమైన ఏర్పాట్లుచేయకపోగా పనిచేయాల్సినవి కూడా చేయకుండా చేశారన్నారు. క్యాష్‌లైన్‌ తప్ప ఆన్‌లైన్‌ గురించి తెలియని మంత్రులు రాజధాని రైతులవద్దకు వెళ్లి ఎందుకు అభిప్రాయాలు తీసుకోలేదని బుద్దా ప్రశ్నించారు. 

read more  సీఎం గారూ... అమరావతి ''దిశ''ల గోడు వినిపించదా...?: దివ్యవాణి ఆవేదన

ప్రజల అభిప్రాయాలను ఈ-మెయిల్‌, ఆన్‌లైన్‌ ద్వారా చెప్పాలంటున్న ప్రభుత్వం ఓట్లను కూడా అదే పద్ధతిలో అడిగి ఉంటే ప్రజలు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పేవారన్నారు. రైతుల ముందుకు వెళ్లే ధైర్యంలేక, ముఖం చెల్లకనే  జగన్‌ ఆయన మంత్రివర్గం ఆన్‌లైన్‌ పేరుతో నాటకాలాడుతోందన్నారు. 

రాష్ట్రచరిత్రలో ప్రజల్ని ఇంతలా మోసగించిన ప్రభుతాన్ని ఇప్పటివరకు చూడలేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియని మంత్రులంతా, ప్రజల కళ్లలో కారంకొడుతూ వారిని మోసగించాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. 

read more  క్షేత్రస్థాయిలో పరిపాలనే జగన్ ఆశయం...అందుకోసమే ఈ ఏర్పాటు: మంత్రులు

20వ తేదీన నిర్వహించాల్సిన కేబినెట్‌ సమావేశాన్ని అత్యవసరంగా  18వ తేదీకి ప్రీపోన్ ఎందుకు చేయాల్సివచ్చిందో చెప్పాలన్నారు.  కేబినెట్‌ సమావేశంలో జగన్‌ నోటినుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయం వెలువడిన మరుక్షణం రాష్ట్రం అగ్నిగుండమవుతుందని, ప్రజలంతా  ఉప్పెనలా విరుచుకుపడి వైసీపీ ప్రభుత్వాన్ని ముంచేస్తారని వెంకన్న హెచ్చరించారు.