అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశాక రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలు 50వ రోజుకి చేరాయని... ఎన్నో మలుపులు తిరిగిన ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం చేయరాని పనులన్నీ చేస్తోందని మండిపడ్డారు టీడీపీ సీనియర్‌నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. ఇప్పటికే ప్రభుత్వం వేయాల్సిన కుప్పిగంతులన్నీ వేసిందని... మహిళలను, రైతులను పోలీసులతో దారుణంగా కొట్టించి వారిపై లేనిపోని సెక్షన్లకింద కేసులు పెట్టిందని... చివరకు ఏమీ  చేయలేక జగన్‌సర్కారు తోకముడిచిందని స్పష్టం చేశారు. 

బుధవారం రామయ్య మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యమకారుల్ని నిలువరిస్తున్నామంటూ పోలీసులు గోళ్లతో రక్కినా, గిచ్చినా మొక్కవోని ధైర్యంతో నేటికీ ఆందోళనలు కొనసాగుతుండటం అభినందనీయమని రామయ్య తెలిపారు. విజయవాడలోని పోలీస్‌స్టేషన్లు అన్నింటినీ రాజధాని మహిళలతో నింపేసి, వారిపై కర్కశంగా లాఠీలు ఝుళిపించినా వారి పోరాటం ఆగలేదన్నారు. 

ప్రభుత్వ వ్యవహారశైలిని పట్టించుకోకుండా ఆందోళనలు కొనసాగించాలని చెప్పడానికే టీడీపీ  అధినేత, జేఏసీ సభ్యులతో కలిసి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారని వర్ల చెప్పారు. తానుపట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా జగన్‌ ఎందుకు వ్యవహరిస్తున్నాడని... ఆందోళనలకు పరిష్కారం చూపకుండా కృత్రిమ ఆందోళనలు చేయించడం ద్వారా ముఖ్యమంత్రి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడని వర్ల ప్రశ్నించారు. 

వైసీపీవారితో రోడ్లపై ఊరేగింపులు చేయించడం, శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నవారిపై కవ్వింపు చర్యలకు పాల్పడటం ఎంతవరకు సబబని... దానివల్ల సభ్యసమాజానికి జగన్‌ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడని వర్ల ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించకుండా అగ్నిలో ఆజ్యంపోసినట్లుగా వ్యవహరించడం ప్రభుత్వానికి ఎంతవరకు భావ్యమన్నారు. 

read more  ''కాకినాడ వాసులకు కరోనా లక్షణాలు... భయంతో వైద్యులు విధులకు గైర్హాజరు''

నారావారిపల్లెలో సభపెట్టి ఏడుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులు వెళ్లినా చివరకు ఖాళీ  కుర్చీలే మిగిలాయని,  ప్రజాఉద్యమాన్ని వదిలేసి మద్ధతులేని వాటికి వంతపాడటం ముఖ్యమంత్రికి తగునా అని రామయ్య ప్రశ్నించారు. వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారికి కావాల్సిన వనరులిచ్చి, ఖర్చులకు డబ్బులిచ్చి రోడ్లపైకి పంపి ఉద్యమాలు చేయిస్తూ ప్రత్యక్షయుద్ధానికి తెరతీయడం సమంజసం కాదని వర్ల హితవు పలికారు. 

వైసీపీ యువజన విభాగం 6వ తేదీన మానవహారాల  నిర్వహణ, 7న కొవ్వొత్తుల ర్యాలీ,  8న ప్రతిపక్షనేతకు మంచిబుద్ధి ప్రసాదించాలని విన్నపాలు చేయనున్నారని తెలిసిందన్నారు. అయితే అదే 8న ఉద్యమకారులు కూడా జగన్మోహన్‌రెడ్డికి మంచిబుద్ధి ప్రసాదించాలని నిరసన తెలుపుతారని... ఎవరెక్కువమంది ఉన్నారో రెఫరెండం నిర్వహించాలని దీనికి జగన్‌, ఆయన సర్కారు సిద్ధమేనా అని వర్ల నిగ్గదీశారు. 

చేసేదేమీలేదని తెలిసికూడా జగన్ వారిపార్టీ వారిని సంతోషపెట్టడానికి సకలవనరులు సమకూర్చాడన్నారు. జగన్‌ వ్యవహారశైలి ఎమర్జెన్సీని తలపిస్తోందని... ఆనాడు ఎమర్జెన్సీలో సెక్షన్‌ 144, సెక్షన్‌-30లు విశృంఖలంగా అమలు జరిపారన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, ప్రతిపక్షనేత, ఇతరసభ్యులు ఎక్కడికివెళ్లే అక్కడ 144సెక్షన్‌ పెట్టడం ఏరాష్ట్రంలోనూ లేదన్నారు. ఎమర్జెన్సీ పెట్టినవారికి ఏ గతిపట్టిందో, జగన్‌ ప్రభుత్వానికి కూడా అదేగతి పట్టనుందన్నారు.

read more  ఏపి రాజధానిపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే... వైసిపికి తెలిసినా...: బోండా ఉమ

జగన్‌సర్కారు నిర్లక్ష్యం కారణంగా 42మంది రైతులు చనిపోయారు అయినా మానవత్వం లేని ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. చివరకు రాజధాని ప్రాంతలోని శాసనసభ్యులు నోరెత్తకుండా జగన్‌ భజనలో మునిగితేలుతున్నారన్నారు. చనిపోయిన వారిని పరామర్శిచండంలో పేటెంట్‌ హక్కులున్న జగన్‌, చనిపోయినవారి కుటుంబాలను  ఇప్పటివరకు ఎందుకు పరామర్శించలేదన్నారు.

జగన్‌ను కలిసినవారు రైతులేనా....?

ఒకవైపు రైతులంతా ఆందోళనలు చేస్తుంటే 20మంది రాజధాని రైతులు ఎమ్మెల్యే ఆర్కే ద్వారా జగన్‌ను కలిశారని, ఆరైతులు ఎవరో, ఏఊరివారో, ఎక్కడినుంచి వచ్చారో చెప్పాలని వర్ల డిమాండ్‌ చేశారు. వచ్చిన రైతులకు తన కార్యాలయంలో పకోడిలు పెట్టి సత్కరించిన జగన్‌ ఇతర రైతులను కూడా అదేమాదిరి ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. 

పత్రిక, ఛానల్‌ ఉన్నాయి కదా అని ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేసుకుంటుంటే ప్రజలు నమ్మరని వర్ల తెలిపారు. అమరావతి రైతుల పేరుతో జగన్‌ని కలిసినవారిలో  పెద్దరైతు ఆళ్ల రామకృష్ణారెడ్డయితే, ఇతరులు వైసీపీ మాజీ జడ్పీటీసీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి,  ఆర్కే లాయర్‌ చోడిశెట్టి నిర్మల, ఆర్కే చిన్నాన్న బోసురెడ్డి, బోసురెడ్డి బావమరిది సాంబిరెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి బాబాయి నాగిరెడ్డి, ఆర్కే బావమరిది వేణుగోపాల్‌ రెడ్డి, ఆర్కేడ్రైవర్లు ఉన్నారని, వీరంతా రైతులా అని వర్ల మండిపడ్డారు. 

రైతులపేరుతో తన బంధువుల్ని తీసుకెళ్లిన ఆర్కే మంగళవారం జగన్‌ సమక్షంలో తన డ్రామాను బాగా రక్తికట్టించాడన్నారు. ముఖ్యమంత్రికి తెలిసో తెలియకో ఆర్కే కుటుంబసభ్యులకు పకోడీలు పెట్టి టీపార్టీ ఇస్తే దాన్ని సాక్షిమీడియా ఆకాశానికి ఎత్తేసిందన్నారు. సీఎం జగన్‌ తమతో రెండుగంటలు మాట్లాడాడని, తమకు ఏ సమస్యలేకుండా చూస్తానని హామీ ఇచ్చాడని వారు చెప్పారన్నారు. ఇలాంటి చర్యల ద్వార జగన్‌ తనకుతానే మోసంచేసుకుంటున్నాడని వర్ల ఎద్దేవా చేశారు. 

జగన్‌ను కలిసినవారికి భూములుఉంటే ఉండవచ్చుగానీ ఇలాంటి చర్యల వల్ల అమరావతి ఉద్యమాన్ని మరింత బలపడేలా, ఉవ్వెత్తున ఎగసేలా చేశారన్నారు. మీడియా సిబ్బందిపై నిర్భయకేసులు పెట్టడంద్వారా వారిని బెదిరించి దారికి తెచ్చుకోవాలని జగన్‌ ప్రయత్నిస్తున్నాడని, మీడియాసిబ్బందిపై, మహిళలు, రైతులపై పెట్టిన తప్పుడు కేసులను తక్షణమే ఎత్తివేయాలని వర్ల డిమాండ్‌ చేశారు.