అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు. ఎంపీ విజయసాయి రెడ్డి సాయంతో గతంలో లక్ష కోట్లు సంపాదించిన జగన్ ఈసారి ఏకంగా మూడు లక్షల కోట్లను సంపాందించాలని టార్గెట్ గా పెట్టుకున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈసారి కూడా జగన్ దోపిడీలో విజయసాయి రెడ్డే ముఖ్యపాత్ర పోషిస్తున్నారని వెంకన్న సోషల్ మీడియా వేదికన తీవ్ర ఆరోపణలు చేశారు. 

''ఏదో ఒక రోజు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొట్టేసిన లక్ష కోట్లు జప్తు అవుతుందనే భయం జగన్ గారిని వెంటాడుతోంది. అందుకే మరో సారి విజయసాయి రెడ్డిని రంగంలోకి దింపి మూడు రాజధానుల పేరుతో మూడు లక్షల కోట్లు దొబ్బేయడానికి స్కెచ్ వేసాడు. విశాఖలో భూ దందా మొదలైంది.''

''ప్రజలకు పండుగలు లేకుండా చేసి, రైతులను బలి తీసుకుంటూ జగన్ గారు రాక్షస ఆనందం పొందుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం అయితే 10 లక్షల కోట్లు సంపద సృష్టించబడుతుంది అని స్వయంగా మీరే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు విజయసాయి రెడ్డి గారు.''

''అంత సంపద వస్తే అందులో లక్ష కోట్లు ఖర్చు చేసి అమరావతిని అభివృద్ధి చెయ్యడానికి మీకు ఉన్న అభ్యంతరం ఏంటి? దళిత రైతులను దెబ్బకొట్టి ఏం సాధించాలి అనుకుంటున్నారు?''  అంటూ బుద్దా వెంకన్న సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిని ప్రశ్నిస్తూ ట్వీట్లు చేశారు.