గుంటూరు: ప్రభుత్వ కార్యాలయాకు వైసీపీ రంగులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి జగన్, మంత్రి బొత్స సత్యనారాయణతో సహా 151 మంది ఎమ్మెల్యేలకు చెంపపెట్టుగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. అనంతపురం జిల్లా అమలాపురం మండలం తమ్మిడిపల్లి పంచాయితీలో అక్టోబర్ 31న వైసీపీ నేతలు జాతీయ జెండా దిమ్మెకు కూడా తమ పార్టీ రంగులు వేసుకున్నారని ఆరోపించారు. దీనిపై జాతీయ మీడియాతో సహా అందరూ గగ్గోలు పెట్టినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని... ఆ పార్టీ నేతలు దిమ్మె రంగులు మార్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. 

టీడీపీ హయాంలో కట్టిన భవనాలకు సిగ్గులేకుండా వైసీపీ రంగులు వేశారని విమర్శించారు. పాఠశాలలు మొదలు మరుగుదొడ్ల వరకు వైసీపీ రంగులేశారని... ఇందుకోసం రూ. 1500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇప్పటికి 42 సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. 

read more   గ్రామ పంచాయితీలపై వైసీపీ రంగులు తొలగించాలి: ఏపీ హైకోర్టు

తమ పార్టీ రంగులు వేయడానికి, తీయడానికి ప్రభుత్వం రూ. 3000 కోట్ల ప్రజాధనం వృథా చేసిందని ఆరోపించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. రంగుల కోసం ఖర్చు చేసిన రూ. 3000 కోట్లు ప్రజా ఖజానాకు వైసీపీ ప్రభుత్వం జమ చేయాల్సిందేనని... ఈ డబ్బులు ఆదా చేసి ఉంటే రైతులకు ధాన్యం బకాయిలు తీరేవని అన్నారు. 

టీడీపీ హయాంలో చంద్రబాబు స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్ లు పెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి వాటికి రంగులు వేయించారని అన్నారు.ఎన్నికల హామీలన్నీ జగన్ తుంగలో తొక్కారని... ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించేశారని ఆరోపించారు. వైసీపీ రంగులపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని టిడిపి తరపున కోరుతున్నామని అన్నారు. 

read more  చంద్రబాబుకు షాక్: టీడీపీకి సతీష్ రెడ్డి రాజీనామా

ఏపీ చీఫ్ సెక్రటరీ వెంటనే రంగంలోకి దిగి రంగులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ తుగ్లక్ చర్యలతో ఏపీకి తీరని నష్టం జరుగుతోందని... జగన్ వ్యవహారశైలి వల్ల 16,700 మంది బీసీలకు రాజకీయంగా నష్టం జరిగిందన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం అధికార వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని... వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.