తుళ్లూరు: రాజధాని కోసం 33000 ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతులు 33 రోజులపాటు ఇలా కూర్చోవడం తానెక్కడా చూడలేదని మాజీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం కోసం కూడా ఇలాంటి పోరాటం జరిగినట్లు తాను ఎక్కడా వినలేదన్నారు.  రైతులకు అన్యాయం చేసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

అయితే రాజధాని ప్రజలు పోలీసులకు సహాయనిరాకరణ చేయడాన్ని రాజకుమారి తప్పుబట్టారు. అందరు పోలీసులు ఒకేలా ఉండరని... వారిని ఇబ్బందిపెట్టడం మంచిదికాదన్నారు. రైతులు,మహిళలు సహృదయం కలిగి ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. 

ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించడం మాత్రమే పోలీసుల వంతని...  అలాంటివారిని వ్యక్తిగతంగా ఇబ్బందిపెట్టడం తగదన్నారు.  పోలీసులకి త్రాగునీరు,ఆహార పదార్థాలు ఇవ్వాలని రాజధాని ప్రజలకు రాజకుమారి సూచించారు. 

read more  ఎస్సీలకు కావాల్సింది మొసలికన్నీరు కాదు... అదొక్కటి చేస్తే చాలు :వర్ల రామయ్య

ఈ దరిద్రపు ప్రభుత్వం వల్ల తన మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు. ఇంకో రెండేళ్ల పాటు పదవీకాలం వున్నా రాజీనామా చేశానని... ఆ పదవిలో వున్నట్లయితే తానేంటో చూపించే దానినని పేర్కొన్నారు. 

రాజధాని మహిళల్ని చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందన్నారు. మహిళల పట్ల పోలీసులు ఇలా ప్రర్తించడం సరికాదన్నారు. కౌన్సిల్ లో తెలుగుదేశం పార్టీకే బలం  ఎక్కువుందని... రాజధాని బిల్లు విషయంలో తామే గెలుస్తామన్నారు.

read more  ఏపికి మూడు రాజధానులు... కేంద్ర ప్రభుత్వ జోక్యం వుండదు...: బిజెపి ఎంపీ జివిఎల్

ఈ వికేంద్రీకరణ బిల్లు అమలు అవ్వబోదన్నారు. మూడు రాజధాని బిల్లు ఒకవేళ అసెంబ్లీలో ఆమోదం పొందినా అమలు చేయాలంటే మరో మూడు నెలలు సమయం  పడుతుందన్నారు. అప్పటివరకు న్యాయస్థానాల ద్వారా పోరాడే అవకాశం కూడా వుంటుందని... చట్టపరంగా అమరావతి సాధించిపెడతామన్నారు. అమరావతి కోసం  పోరాటపటిమ చూపిస్తున్న అందరికి అభినందనలు తెలిపారు నన్నపనేని రాజకుమారి.