పవన్ కల్యాణ్ జాగ్రత్త...అలాగే చేస్తే రాష్ట్రంలో తిరగలేవు: మంత్రి వార్నింగ్
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పైనా, ప్రభుత్వంపైనా అవాకులు చవాకులు పేలితే సహించేదిలేదన్నారు.
విజయవాడ: ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది, ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలపై విమర్శలు చేయడమే జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పనిగా పెట్టుకున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అందులోభాగంగానే రాజధానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడని... టిడిపి డైరెక్షన్ లో బిజెపి ముసుగులో ఇదంతా చేస్తున్నాడని మంత్రి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుతగిలి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించాలని చూస్తే సహించేది లేదన్నారు. పవన్ వ్యవహారశైలి ఇలాగే కొనసాగితే ఆంధ్రాలో ఎక్కడ తిరగలేకుండా చేస్తామని దేవదాయ శాఖ మంత్రి హెచ్చరించారు.
read more రాజధాని కోసం 15 ఎకరాలు... తుళ్లూరు రైతు గుండెపోటుతో మృతి
బుధవారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురం 28వ డివిజన్లో కోటి 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న బిటి రోడ్డుకు మంత్రి వెల్లంపల్లి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ కు రాజకీయాల్లో, ఆలోచనల్లో స్థిరత్వం లేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఓడించినా పవన్ కు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. జగన్ పైనే కాదు ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం మాని షూటింగ్లు చేసుకోవాలని సూచించారు. అలాకాకుంటే తన పార్టీ తరపున రాజకీయాలను చేసుకోవాలని మంత్రి హితవు పలికారు. ఉదయం సినిమా షూటింగులు.... సాయంత్రం చంద్రబాబుతో మీటింగ్ లు చేయడం ప్రజలు గమనిస్తున్నారని పవన్ పై మంత్రి వెల్లపల్లి సెటైర్లు విసిరారు.
read more ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
విజయవాడ నగర అభివృద్ధి ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ నగర అభివృద్ధిని గత ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం చేశారన్నారని ఆరోపించారు. భవాని పురం పోలీస్ స్టేషన్ ఎదుట రహదారి నుండి ఐరన్ యాడ్ మెయిన్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నాణ్యతతో నిర్మించి అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి వెల్లంపల్లి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.