కృష్ణా జిల్లా: పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు రవీంద్రనాథ్ బాబుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పోలీసులతో కాస్సేపు సరదాగా గడిపారు.

ఇక్కడే ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ను కూడా మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....జాతి కోసం, రాష్ట్రం కోసం, ప్రజలు సుఖ సంతోషాలతో బతకటం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకోవడం...అలాంటి కార్యక్రమంలో తాను పాల్గొనడం ఆనందంగా వుందన్నారు. పోలీస్ అమరవీరులను స్మరించుకోవడమే కాకుండా రక్తదాన శిబిరం నిర్వహించి సమాజసేవ చేస్తున్న పోలీసులను ప్రశంసించకుండా  వుండలేకపోతున్నానని అన్నారు.

సమాజం కోసం త్యాగాలు, బలిదానాలు, శ్రమ చేస్తున్న పోలీసులను ప్రతి ఒక్కరూ అభినందించి తీరాలన్నారు. ఎవరో ఒకరు తప్పుచేసారని పోలీసులను వేలెత్తి చూపటం కంటే వారు ఉంటేనే మనం భద్రంగా ఉన్నామని గుర్తుంచుకోవాలని సూచించారు. పాఠశాల, కాలేజి విద్యార్థులకు పోలీసుల పనితీరుపై అవగాహ కొరకు ఓపెన్ హౌస్ నిర్వహించడం చాలా మంచి చర్యగా మంత్రి పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ రవీంద్రనాథ్ బాబు  మాట్లాడుతూ...అమరవీరుల దినోత్సవానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అక్టోబర్ 15 నుండి 21 వ తేదీన పోలీసు అమరవీరుల వారోత్సవాల జరుగుతాయని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో పోలీసు శాఖ పనితీరు, వివిధ అంశాలపై పాఠశాల, కాలేజి విద్యార్థులకు అవగాహన, పోటీల నిర్వహణ  వుంటుందని తెలిపారు.  పోలీసు శాఖ అందిస్తున్న సేవలు ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అక్టోబరు 21 వ తేదీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో ర్యాలీ, పరేడ్ నిర్వహిస్తామని వెల్లడించారు.