విజయవాడ: మద్యం మత్తు ముందు మానవ సంబంధాలు చిన్నబోయాయి. మద్యానికి డబ్బులు లేకపోవడంతో ఏకంగా కన్న కూతురునే అమ్మకానికి పెట్టాడో కసాయి తండ్రి. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

మహారాష్ట్ర నాందేడ్‌ నివాసి సతీష్‌, మీనా భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. అయితే స్థానికంగా ఉపాధి లేకపోవడంతో బ్రతుకుదెరువు కోసం ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరుకు వలసవచ్చారు. కానీ వీరికి పని ఇప్పిస్తానని చెప్పి రప్పించిన వ్యక్తి మోసం చేశాడు. దీంతో అక్కడే ఓ గూడారాన్ని ఏర్పాటు చేసుకుని కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. 

ఈ క్రమంలో మంగళవారం నెల్లూరు నుండి విజయవాడకు మకాం మార్చారు. అక్కడ ఓ బార్ లో మద్యం తాగడానికి వెళ్లిన సతీష్ డబ్బుల కోసం ఏ తండ్రీ చేయని పనికి పూనుకున్నాడు. తన పెద్ద కూతురిని కేవలం రూ.5వేలకే అమ్మకానికి పెట్టాడు. బార్ వద్దకు వచ్చిన కొందరిని తన కూతురుని కొనుక్కోవాలని అడగగా అనుమానం వచ్చినవారు పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే పోలీసులు బార్ వద్దకు చేరుకుని సతీష్ నుండి చిన్నారి కాపాడారు. అనంతరం సతీష్‌తో పాటు భార్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఛైల్డ్‌లైన్‌ నిర్వాహకులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇప్పించారు. ఇకపై ఇలా చేయొద్దని సతీష్ ను గట్టిగా హెచ్చరించి వదిలిపెట్టారు.