ఒంటరి మహిళలే టార్గెట్, పెళ్లి చేసుకుంటానని ఎర.. ఘరానామోసగాడు అరెస్ట్....
భర్తను కోల్పోయి లేదా విడాకులు తీసుకుని రెండో పెళ్లికోసం మాట్రిమోనిలో రిజిస్టర్ చేసుకున్న ఒంటరి మహిళలే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఓ నయవంచకుడు ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు.
భర్తను కోల్పోయి లేదా విడాకులు తీసుకుని రెండో పెళ్లికోసం మాట్రిమోనిలో రిజిస్టర్ చేసుకున్న ఒంటరి మహిళలే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఓ నయవంచకుడు ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు.
వివరాల్లోకి వెడితే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన జగ్గవరకు ప్రదీప్ కుమార్ బీటెక్ చదువుకున్నాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కానీ డబ్బుల మీద విపరీతమైన ఆశ. దీనికోసం అడ్డదారులు తొక్కాడు. తన రూపాన్ని, మాటల నైపుణ్యాన్ని ఎరగా పెట్టి మాట్రిమోనియల్ ముసుగులో మహిళల్ని మోసం చేస్తున్నాడు.
ప్రదీప్ కుమార్ కు 2017లో వివాహం అయ్యింది. గొడవల కారణంగా 2019లో విడాకులు తీసుకున్నాడు. విజయవాడలోని ఓ మ్యారేజ్ మ్యాట్రిమోనీ సైట్ లో తన వివరాలు రిజిస్టర్ చేశాడు. రెండో వివాహం కోసం చూస్తున్న ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. బాగా నమ్మకం కుదిరాకా తన కుటుంబ పరిస్థితి బాలేదని చెప్పి విడతలవారీగా ఆమె దగ్గర పన్నెండున్నర లక్షలు వసూలు చేశాడు. ఆ తరువాత మొహం చాటేశాడు. డబ్బులు అడిగితే తప్పించుకుంటున్నాడు. పోన్ చేస్తే ఎత్తడంలేదు.. చివరికి మోసపోయానని గుర్తించిన ఆ మహిళ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.
మ్యాట్రిమోనీలో రెండో పెళ్లికోసం చూసే యువతులను టార్గెట్ చేసుకుని ముందుగా వారికి ఫోన్ చేస్తాడు. వారితో మంచిగా మాట్లాడి నమ్మకం పెంచుకుంటాడు. నేరుగా ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుంటానని, వాళ్లు తనకు బాగా నచ్చారని చెబుతాడు. వాళ్ల బలహీనతలను ఆధారంగా చేసుకుని సమయం చూసి శారీరకంగా లోబరుచుకుంటాడు. ఆ తరువాత డబ్బులు కాజేసి జారుకుంటాడు. ప్రతీ కేసులోనూ ప్రదీప్ ఇదే స్ట్రాటజీని ఉపయోగిస్తాడు.
ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ప్రదీప్ హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్ మీద కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఇలాంటి కేసే నమోదయ్యింది. దర్యాప్తులో భాగంగా ప్రదీప్ ఇలా పదుల సంఖ్యలో మహిళలను మోసం చేసినట్టు తేలింది.