విజయవాడ: నగరంలో మతిస్థిమితం లేని ఒక యువతి హల్చల్ చేసి పోలీసులను ఫైర్ సేఫ్టీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది.

 విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అగ్రిగోల్డ్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న ఒక చెట్టు ఎక్కి నానా హంగామా సృష్టించింది. మహిళ హఠాత్తుగా చెట్టెక్కడాన్ని గమనించిన స్థానికులు    పోలీస్ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించారు. 

హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మహిళా మిత్ర పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని చెట్టు ఎక్కినఎక్కిన మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే చెట్టు దిగడానికి సదరు మహిళ చెప్పిన డిమాండ్ విని బిత్తరపోవడం  పోలీసుల వంతయ్యింది. 

తాను చెట్టు దిగాలంటే ఇక్కడినికి హీరో మహేష్ బాబు రావాలని... మోడీతో మాట్లాడాలని... జగన్ కూడా ఇక్కడికి వచ్చి తన సమస్యలను పరిష్కరించాలంటూ  మరింతగా పైకెక్కింది. ఈ దృశ్యాలను సెల్ ఫోన్లలో వీడియో తీస్తున్నవారిపై మహిళ చెట్టుకొమ్మలను విసురుతూ హంగామా చేసింది. 

పరిస్థితిని గమనించిన పోలీసులు బ్లూ కోర్స్ దళాన్ని రంగంలోకి దించారు. ఇంతలో మహిళ చెట్టు చివరకు చేరుకోవడంతో ఆమెను కాపాడేందుకు స్థానికులు పరదాలు తీసుకొచ్చి  ప్రమాదం నుంచి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే వారిపై కూడా ఆమె చెట్టుపై వుండే కర్రలను విసరడంతో ఈ ప్రయత్నం విరమించుకున్నారు. 

చివరకు ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి మహిళ కింద పడి పోకుండా నెట్స్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు భారీ నిచ్చెన సహాయంతో తో ఫైర్ సేఫ్టీ అధికారులు చెట్టుపైకి ఎక్కి మతిస్థిమితం లేని మహిళను కిందికి తీసుకొచ్చారు.

మహిళా మిత్ర పోలీసులు అక్కడికి చేరుకొని మహిళా వివరాలు సేకరించారు. తాను కలకత్తా నుంచి రైల్లో వచ్చారని... ఇక్కడ తనకు మోసం జరిగిందని ఆ మహిళలకు పొంతనలేని సమాధానం చెప్పింది. దీంతో పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.