విజయవాడ: కృష్ణా జిల్లా మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారు కొద్ది సేపు పోలీసులు హైరానా పెట్టింది. ఆయన కారు హల్ చల్ చేసింది. ఉప్పులేరు చెక్ పోస్టు వద్ద కారు ఆపకుండా దూసుకుపోయింది.

లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా దూసుకుపోయిన కారును వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. కైకలూరు పోలీసు స్టేషన్ లో డ్రైవర్ ను విచారించారు. కారులో ఎమ్మెల్యే భార్య ఉన్నారు. ఆమె ఓ వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్నట్లు తెలిసింది. డ్రైవర్ ను విచారించిన తర్వాత కారును పంపించి వేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 534కు చేరుకుంది. కొత్తగా కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో మూడేసి కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొంది 20 మంది డిశ్చార్జీ అయ్యారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలలో 4గురు చొప్పున, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఇద్దరు చొప్పున చనిపోయారు.  విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఏ విధమైన కేసులు నమోదు కాలేదు.