విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోంది. తాజాగా, మాచవరం కానిస్టేబుల్ కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అతను ప్రతి రోజు విజయవాడ - మచిలీపట్నం డైలీ సర్వీసు చేస్తుంటాడు. అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు. అయితే, ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు మాంసం వ్యాపారి కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మాంసం వ్యాపారితో కాంటాక్టులోకి వచ్చినవారి కోసం ఆరా తీస్తున్నారు.

పాజిటివ్ వచ్చిన వ్యక్తి సుకర్లాబాదకు చెందిన కానిస్టేబుల్ అని ఆర్డీవో ఖాజావలీ చెప్పారు. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడని చెప్పారు. విజయవాడలో అనుమానిత పోలీసులకు పరీక్షలు జరపగా సుకర్లాబాదవాసికి కోరనా వచ్చినట్లు తేలిందని, ఇతనితో పాటు అదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న మరో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయినట్టు సమాచారంఉందని చెప్పారు. పాజిటీవ్ రావటంతో బాధితుడిని విజయవాడకు తరలించారు. 

ఇప్పటికే చిలకలపూడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటీవ్ రాగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా కేసుతో మచిలీపట్నంలో కరోనా కేసుల సంఖ్య 4కు  చేరింది.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ధూళిపాళ్ల స్థానికులు కరోనా భయంతో వణికిపోతున్నారు. ప్రైమరీ కాంటాక్టు మహిళ నర్సారావుపేటకు వెళ్లి వచ్చింది. ఆ ప్రైమరీ కాంటాక్ట్ మహిళ అత్తకు కరోనా వైరస్ పాజిటివ్ ఉంది. 

దాంతో మహిళ కుటుంబానికి చెందిన ఐదుగురిని క్వారంటైన్ కు తరలించారు. నర్సారావుపేటలో ఇప్పటికే 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే, సత్తెనపల్లిలో పిల్లలతో కలిపి 9 మందిని క్వారంటైన్ కు తరలించారు.

కాగా, గుంటూరులో బిర్యానీ వ్యాపారి అంత్యక్రియలపై వివాదం చోటు చేసుకుంది. దాంతో ఆదివారం అతని అంత్యక్రియలను వాయిదా వేశారు. ఈ రోజు అతని కుటుంబ సభ్యులతో అధికారులు చర్చించనున్నారు. ఆ తర్వాత అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తారు.

బిర్యానీ వ్యాపారి శనివారంనాడు మరణించాడు. అతనికి కరోనా వైరస్ ఉన్నట్లు మరణం తర్వాత తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మృతుడితో సన్నిహితంగా మెలిగినవారి కోసం ఆరా తీస్తున్నారు. అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.