మచిలీపట్నం: విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారు. విజయవాడ కార్పోరేషన్ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేతను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. 

విజయవాడ టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని రెండో కుమార్తె కేశినేని శ్వేతాగత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కేశినేని నాని తరుపున విస్తృతంగా ప్రచారం చేశారు.  శ్వేత అమెరికాలో ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తరపున అక్కడ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో కేశినేని నాని చురుగ్గా వ్యవహరిస్తారనే విషయం తెలిసిందే. విజయవాడ కార్పోరేషన్ పరిధిలో ఆయనకు పట్టు ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు శ్వేత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు భావిస్తున్నారు.

శ్వేత కేశినేని వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. హిల్లరీ క్లింటన్ తో దిగిన ఫొటోను కూడా గతంలో ఆమె ట్విట్టర్ లో పోస్టు చేశారు. కేశినేని నాని కార్యక్రమాలను ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వాారా ప్రచారంలోకి తెస్తున్నారు.