విజయవాడ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో రానున్న రెండు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని అన్ని మండలాలలో గల లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ యంత్రాంగాని కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో టెలీ కాన్పరెన్స్ ద్వారా అధికారులకు, రెవిన్యూ యంత్రాంగానికి కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

జిల్లాలోని అన్ని డివిజనల్ కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లు  ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు రెవిన్యూ యంత్రాంగానికి సహకరించాలని సూచించారు.  ఈ మేరకు జిల్లాలో డివిజన్ల వారిగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లను వెల్లడించారు. 

కంట్రోల్ రూం ఫోన్ నెంబర్లు...

బందరు కలెక్టరేట్ : 08672-252572 

విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయ: 0866 - 2474805 

సబ్ కలెక్టర్ ఆఫీస్  విజయవాడ : 0866-2574454 

సబ్ కలెక్టర్ ఆఫీస్ నూజివీడు 08656- 232717

రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ బందర్ ఫోన్ నెంబర్ : 08672-252486 

రెవిన్యూ డివిజనల్ ఆఫీస్ గుడివాడ ఫోన్ నెంబర్ : 08674 - 243697

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో  గాలులు వీస్తాయని, అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తుకి ఎగిసిపడే అవకాశం వుందని తెలిపింది.

ఇదిలావుంటే బుధవారం కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో మంగళవారం వానలు కురిశాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.శుక్రవారం విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం వుందని, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.