అమరావతి: రాష్ట్రంలో డెంగ్యూ, వైరల్ జ్వరాలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 14 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగ్యూ, వైరల్ జ్వరాల నిర్దారణ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే జ్వరాల నివారణకు అవసరమైన మందులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో వుంచామని వెల్లడించారు.

శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్బంగా ఓ సభ్యుడు రాష్ట్రంలో డెంగ్యూ, వైరల్ జ్వరాలపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమధానం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 145 బ్లడ్ బ్యాంకులు వున్నాయని... 13 రక్త సేకరణ రవాణా వాహనాలు, 95 రక్త నిల్వ కేంద్రాలు వున్నాయని వెల్లడించారు. ప్రతిజిల్లాలో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఆసుప్రతి కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం జరుగుతోందన్నారు. 

జ్వరాలు, ఇతర వ్యాధులపై ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఎలిజా పరీక్షలు అందుబాటులో వున్నాయన్నారు. రాష్ట్రంలో 47,970 మందికి రక్త పరీక్షలు చేయిస్తే... 5021 డెంగ్యూ కేసులను గుర్తించామని తెలిపారు. డెంగ్యూ పీడితులకు మెరుగైన వైద్యం అందించి 99శాతం వరకు వ్యాధిని నయం చేశామని పేర్కొన్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఉర్ధూ మీడియం: మంత్రి అవంతి ప్రకటన

జ్వరాలు, వ్యాధులు ప్రబలిన చోట్లకు వెంటనే వైద్య బృందాలను తరలిస్తున్నామన్నారు. ఇక వైఎస్ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారని...రెండువేల వ్యాధులను వైఎస్ఆర్‌ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నామన్నారు. 

పైలట్ ప్రాజెక్ట్ గా పశ్చిమ గోదావరిజిల్లాలో అమలు చేస్తున్నామని తెలిపారు. దశల వారీగా అన్ని జిల్లాల్లోనూ దీనిని అమలు చేస్తామని...రూ.1000 కి పైగా ఖర్చు అయ్యే చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ అనంతరం పోస్ట్ ఆపరేషన్‌ సాయంగా గరిష్టంగా రూ.5వేల వరకు చెల్లించనున్నట్లె తెలిపారు.

read more అన్నా క్యాంటిన్ల పునఃప్రారంభం ... కొత్త పద్దతిలో: బొత్స 

ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు ఆసుపత్రుల్లో కూడా వైద్య సేవలకు అనుమతి వుందన్నారు. పిహెచ్‌సి లను కూడా నాడు-నేడు కార్యక్రమంలో భాగం చేస్తామన్నారు. త్వరలోనే సీఎం జగన్‌ చేతుల మీదిగా దీనికి శ్రీకారం చుడతామని...పిహెచ్‌సిల్లో అన్ని వసతులును కల్పిస్తామన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా వున్న వైద్యులు, సిబ్బందిని వచ్చే మే నాటికి భర్తీ చేస్తామని మంత్రి కాళీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.