అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంపై మంగళవారం సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ఓ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన ఇప్పుడు రాష్ట్రంలో పలుచోట్ల అలజడులకు కారణమయ్యింది. ఈ క్రమంలో ఉండవల్లి సచివాలయం వద్ద నిరసనకు దిగిన టిడిపి నాయకులు, కార్యకర్తలను  వైసిపి వర్గీయులు అడ్డుకునే  ప్రయత్నం చేశారు. దీంతో టిడిపి, వైసిసి వర్గీయుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది.  

రాజధానిపై నిన్న(మంగళవారం) ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనను నిరసిస్తూ టిడిపి వర్గీయులు సచివాలయం వద్ద నిరసనకు దిగారు. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకస్తున్నామని ప్రభుత్వానికి,  జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  అయితే జగన్ ప్రభుత్వంపై బురద చల్లటానికే మీరు నిరసన చేస్తున్నారంటూ వైసిపి వర్గీయులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. 

read more సైకో నిర్ణయాలతో ప్రజాధనం వృధా... ఎవడబ్బ సొమ్మని...: జగన్ పై టిడిపి అనిత ఫైర్

టిడిపి, వైసిపి వర్గాలు బాహాభాహీకి సిద్దమవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఓ వర్గంపై మరో వర్గం దాడులు చేసుకున్నారు. అలాగే మాటలు, నినాదాలతో చెలరేగడంతో యుద్ద వాతావరణం ఏర్పడింది. దీంతో ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సచివాలయం వద్దకు చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడినుండి  పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నిరసనలతో సచివాలయ పనులకు కూడా ఆటంకం కలిగింది. పనులపై వచ్చే సామాన్యులు ఈ నిరసనల కారణంగా పనికాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. 

read more  చంద్రబాబు, లోకేశ్ మధ్య విబేధాలు... ఇదే నిదర్శనం: పేర్ని నాని

శాసనసభలో సీఎం జగన్ మూడు చోట్ల రాజధానిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో గుంటూరు ప్రజలు రోడ్డెక్కారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలోని ప్రజలు,  రైతులతో తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలను ప్రారంభించింది. రాజధానిపై జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనల్ల జెండాలతో నిరసనకు దిగారు.

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు లార్జి సెంటర్ వద్ద కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజధాని అమరావతిపై తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ప్రతిపక్ష  నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా అమరావతి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు దాన్ని కాదని  వైస్సార్ పార్టీ నేతలు జిల్లాకో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారా అని ప్రశ్నించారు. 

ఇప్పటికే పనులు లేక కార్మికులు పస్థులతో పడుకుంటున్నారని ఆవేదన  వ్యక్తం చేశారు. అభివృద్ధికి కృషి చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్  టిడిపి హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను పూర్తిగా తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అన్న క్యాంటీన్ నుంచి ఇప్పుడు రాజధాని వరకు పూర్తిగా తొలగిస్తున్నారని అన్నారు.

వికలాంగులు, వృద్ధులను కూడా వదలకుండా వారికి పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ  నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రాజధాని రైతులు, రైతుకూలీలు, కార్మికులు పాల్గొన్నారు.