కృష్ణాజిల్లా : గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లిలో మానవత్వం మంటగలిసే సంఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిని కన్న తండ్రే అమ్మకానికి పెట్టాడు. అమ్మాయి పుట్టిందన్న కోపంలో ఆ కసాయి తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 

నూజివీడు మండలం కొత్తూరు తండా సిద్దార్థ నగర్ కు చెందిన రజిత అవుటుపల్లిలోని పిన్నమనేని సిద్దార్థ హాస్పిటల్ ప్రసవించింది. ఆమెకు ఇద్దరు పండంటి ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఇలా కవల పిల్లలు పుట్టిన ఆనందం మాత్రం రజిత భర్త రాజేశ్ కు కలగలేదు. వారి భవిష్యత్ లో తనకు భారంగా మారతారన్న కుచించుకు పోయిన  మనస్థత్వంతో ఆలోచించి ఓ చిన్నారిని అమ్మకానికి పెట్టాడు. 

8 రోజుల వయసున్న చిన్నారుల్లో ఒకరిని అమ్మేందుకు రాజేశ్ బేరంపెట్టాడు. లక్షన్నర రూపాయలకు అమ్మేందుకు సిద్దంకాగా రజిత తండ్రి అతన్ని అడ్డుకున్నాడు.  అల్లుడితో గొడవకు దిగి తన మనవరాలిని కాపాడుకున్నాడు.  ఈ విషయాన్ని కూడా చిన్నారుల తాతే బయటపెట్టాడు. 

ఇద్దరు ఆడకవలలు కావడంతోనే అల్లుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిపాడు. తాను అడ్డుకుని వుండకపోతే ఓ చిన్నారి ఇప్పటికే తమకు దూరమయ్యేదన్నాడు. ఆడపిల్లలు పుట్టారని తెలిసినప్పటి నుండి అతడు విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించాడని...ఈ క్రమంలోనే అతడి కదలికలపై కన్నేయగా చిన్నారిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు.  అందువల్లే ముందుగానే ఈ దారుణాన్ని అడ్డుకోగలిగానని తెలిపారు.  

నాలుగేళ్ళ క్రితం  రాజేష్-రజితలు  ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పటికే తొలి సంతానంలో మగబిడ్డకు జన్మనిచ్చిన రజిత రెండోసారి ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇది నచ్చని రాజేశ్ చిన్నారిని వదిలించుకోడానికి అమ్మకానికి పెట్టి దొరికిపోయాడు.