స్థానికసంస్థల ఎన్నికలకు ముందే వైసిపికి షాక్... ఈసీ కీలక నిర్ణయం
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమీషన్ షాకిచ్చింది.
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానికసంస్థల ఎన్నికలకు ముందే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో ఇటీవల ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల సేవలను వినియోగించుకోవద్దని అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని... ఇందుకోసం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారులకు సూచించింది.
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు వాలంటీర్లను భారీగా నియమించింది. అయితే ఈ ఉద్యోగాలను ప్రభుత్వం కేవలం వైసిపి పార్టీ కార్యకర్తలకే ఇచ్చిందని ప్రతిపక్ష టిడిపి మొదటినుండి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికసంస్థల ఎన్నికల్లో వారిని ఎన్నికల విధుల్లో నియమించకూడదని ఈసీకి టిడిపి నాయకులు ఫిర్యాదుచేశారు. దీంతో ఈసీ వారిని విధుల్లోకి తీసుకోవద్దని నిర్ణయం తీసుకుంది.
అలాగే ఎన్నికల పరిశీలకులుగా నియమించిన ఐఎఎస్ అధికారులు వెంటనే విధుల్లోకి చేరాలని రమేష్ కుమార్ తెలిపారు. ఎలక్షన్ కమీషన్ తరపున ఎలాంటి భయం లేకుండా నిస్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని వారికి సూచించారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల్లో అక్రమాలు, అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ప్రశాంతంగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నిక కమీషన్ సిద్దమైంది. ఇందుకోసం జిల్లాలవారిగా ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా 13 జిల్లాలకు పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది ఈసీ.
జిల్లాల వారిగా పరిశీలకుల వివరాలు
కె. ఆర్.బి. హెచ్. ఎన్. చక్రవర్తి - కర్నూలు,
ఎం. పద్మ - కృష్ణ జిల్లా ,
పి.ఉషా కుమారి - తూర్పు గోదావరి జిల్లా,
పి.ఎ. శోభా - విజయనగరం జిల్లా,
కె. హర్షవర్ధన్ - అనంతపురం జిల్లా,
టి. బాబు రావు నాయుడు - చిత్తూరు జిల్లా,
ఎం. రామారావు - శ్రీకాకుళం జిల్లా,
కె. శారదా దేవి - ప్రకాశం జిల్లా ,
ప్రవీణ్ కుమార్ - విశాఖపట్నం జిల్లా,
బి. రామారావు -ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా
పి. రంజిత్ బాషా - వైయస్ఆర్ కడప జిల్లా,
కాంతిలాల్ దండే - గుంటూరు జిల్లా,
హిమాన్షు శుక్లా - పశ్చిమ గోదావరి జిల్లా
అలాగే నలుగురు సీనియర్ ఉన్నతాధికారులు సిహెచ్. శ్రీధర్, జి. రేఖ రాణి, టి.కె.రామమణి, ఎన్.ప్రభాకర్ రెడ్డి లను అదనంగా నియమించింది. అయితే వీరికి ఏ జిల్లాను అప్పగించకుండా రిజర్వులో ఉంచింది.