దిశ చట్టం అమలు...ఎస్పీలకు డిజిపి గౌతమ్ సవాంగ్ సూచనలివే
దిశ చట్టం అమలుకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకు జిల్లా ఎస్పీలతో రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీలకు పలు సూచనలు చేశారు.
అమరావతి: ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్త్రీలకు రక్షణ కల్పిస్తూ, అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించేందుకు ''దిశ చట్టం'' ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, నిబద్దతతో ఈ చట్టాన్ని రూపొందించినా అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం పోలీసులదే. దీంతో ఈ దిశ చట్టంపై జిల్లా ఎస్పీలతో ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ సమావేశమయ్యారు.
మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడమే ఈ చట్టం ఉదేశమని తెలిపారు. గతంలో కొన్ని నేరాలకు సమయ పరిమితులు ఉన్నాయని... కానీ అత్యాచార ఘటనల్లో చాలా ఎక్కువ రోజుల కాలపరిమితిని నిర్ణయించారని తెలిపారు. దాన్ని కేవలం 21రోజులకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని... ఈ నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. ప్రజల ఆకాంక్షలను పెంచడానికి పోలీసులంతా కట్టుబడి ఉంటారని డిజిపి వెల్లడించారు.
అత్యాచార ఘటనల్లో వేగంగా కేసు దర్యాప్తు జరపడంతో పాటు ...నిందితులను తక్షణమే అరెస్ట్ చేయడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా ఎస్పీలు
సాధ్యమైనంత తొందరగా ఫోరెన్సిక్ నివేదికలు అందేవిధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫోరెన్సిక్ నివేదికతో పాటు డిఎన్‌ఎ రిపోర్టులు తక్షణమే అందేవిధంగా చర్యలు తీసుకోవాలని... అందుకోసం రాష్ట్ర పోలీస్ విభాగం సహకారం తీసుకోవాలని ఎస్పీలకు డిజిపి సూచించారు.
నిర్ణీత సమయంలో బాధితులు, నిందితుల వయస్సు నిర్ధారణ, పోస్ట్ మార్టం మరియు అన్ని రకాల మెడికల్ రిపోర్ట్స్ అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దిశ చట్టంలో పేర్కొన్న అన్ని నిబంధనలను ఫాలో అవుతామని డిజిడి గౌతమ్ సవాంగ్ తెలిపారు.