రాజధానిపై కేంద్ర ప్రకటన... జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు...: దేవినేని ఉమ
ఆంధ్ర ప్రదేేశ్ రాజధాని విషయంలో కేంద్రం చేసిన ప్రకటన జగన్ ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టులా మారిందన్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసామని కేంద్రం స్పష్టంగా ప్రకటన చేసిందని టిడిపి నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. రాజధానిని అమరావతి నుండి తరలించాలనుకుంటున్న జగన్ ప్రభుత్వానికి ఈ సమాధానం చెంపపెట్టులా తగిలి వుంటుందన్నారు. రాజధానిపై ఇప్పటికే రాష్ట్ర పరిధిలో నిర్ణయం జరిగిందని...ఇది ఇక ముగిసిన అధ్యాయమన్నారు. ఇప్పటికే కేంద్రం దేశ పటంలో అమరావతి ని గుర్తించిన విషయాన్ని వైసిపి ప్రభుత్వం గుర్తించాలన్నారు.
రాష్ట్రంలో రివర్స్ పాలనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇప్పుడు నదీజలాలను కూడా రివర్స్ తీసుకుని వెళ్తామంటోందని ఎద్దేవా చేశారు. గోదావరి జలాలను తెలంగాణ భూభాగం నుంచి తరలించాల్సిన అవసరం ఏముందని... కనీస అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదన్నారు.
read more ఆయనేం సృష్టికర్త కాదు... అనుకుంటాడు అంతే..: యనమలపై బొత్స సెటైర్లు
ఏపి ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి లు సూడో మేధావులంటూ విమర్శించారు. వీరిద్దరూ విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఉమ విమర్శించారు.
రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టులో ఎంత కాంక్రీట్ వేసారో చెప్పాలన్నారు. తాము ప్రతిష్టాకంగా భావించి పోలవరం పనులను శరవేగంగా సాగించామని... ఈ ప్రభుత్వం మాత్రం పోలవరం నిర్మాణాన్ని పక్కనపెట్టి పనికిమాలిన వ్యవహారాల్లో మునిగిపోయిందని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
read more అందుకోసమైతే చంద్రబాబు దేనికైనా సిద్దం...లేకపోతే మాత్రం..: మంత్రి అవంతి
పోలవరం పనుల పురోగతిపై గతంలో బులెట్ దింపుతా అని మాట్లాడిన మంత్రి సమాధానం చెప్పగలరా..? అని ప్రశ్నించారు. ఇప్పటికయినా పోలవరం నిర్మాణ పనులను చేపట్టి రాష్ట్రంలోని రైతులుకు మేలు చేకూర్చాలని మాజీ మంత్రి దేవినేని ఉమ సూచించారు.