విజయవాడలో జగన్ ఫోటోకి పాలాభిషేకం...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు విజయవాడ నగరంలో దేవినేన్ అవినాష్ ఆద్వర్యంలో పాలాభిషేకం జరిగింది.
విజయవాడ: ఏపిఎస్ ఆర్టీసి ప్రభుత్వంలో విలీనమవడం పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి వైసీపీ యువనేత దేవినేని అవినాష్ పాలాభిషేకం నిర్వహించారు. ఆటోనగర్ బస్ స్టాండ్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఆర్టీసి కార్మికులతో కలిసి అవినాష్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆర్టీసి ఉద్యోగుల జీవితాల్లో నిజంగానే ఓ కొత్త అద్యాయం మొదలయ్యిందని అవినాష్ అన్నారు.
పాదయాత్ర, ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను జగన్ పూర్తిచేస్తున్నారని అన్నారు. అలా ఆర్టీసి ఉద్యోగులకు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్నారని అన్నారు. ఈ నిర్ణయంతో జగన్ చరిత్రలో నిలిచిపోయాడన్నారు.
ఒక్క నిర్ణయంతో 52 వేల మంది ఆర్టీసి ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చేసి చూపించిన ఘనత జగన్ కె దక్కుతుందన్నారు. దశాబ్దాల ఆర్టీసి కార్మికుల కళ నెరవెర్చిన వ్యక్తి ముఖ్యమంత్రి జగనే అంటూ ప్రశంసలు కురిపించారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ దమ్మున్న నాయకుడి దగ్గర పని చేస్తున్నామన్న సంతోషంతో ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలతో వైసిపి ప్రభుత్వం మరింత ప్రజాబిమానాన్నా చూరగొంటుందని అవినాష్ అన్నారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 52 వేల మంది ఆర్టీసీ కార్మికులు జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులేనని ప్రకటించారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుండి ఆర్టీసి ఉద్యోగులు కాస్త ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు.
రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో మాట్లాడుతూ.... ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఏపీ రోడ్డు రవాణా సంస్థలోని ఉద్యోగులను అందరినీ ప్రభుత్వంలో విలీనం చేయటానికి జగన్ ప్రభుత్వం ప్రజారవాణా శాఖ అనే కొత్త శాఖను ఏర్పాటు చేశామన్నారు.ఆర్టీసీ ప్రైవేటు పరం అవుతుందన్న తరుణంలో నాడు వైయస్ రాజశేఖర రెడ్డి ఆర్టీసీకి జీవం పోశారని మంత్రి గుర్తుచేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తామని జగన్ ఎన్నికల ముందు పాదయాత్రలో చెప్పటమే కాకుండా మేనిఫెస్టోలోనూ పొందుపరిచారని మంత్రి తెలిపారు.
1997లో చంద్రబాబు 141997 అనే చట్టాన్ని తెచ్చారు. ప్రభుత్వ అనుబంధ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులను ఎవ్వరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా చేయకుండా అడ్డుకోవటానికి ఈ చట్టాన్ని తెచ్చారని నాని గుర్తుచేశారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్నవారి రిటైర్మెంట్ పరిమితిని 60 ఏళ్లకు పెంచినట్లు తెలిపారు. జనవరి 1 తారీఖు నుంచి వీళ్లంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణీ అవుతారని ముఖ్యమంత్రి వెల్లడించారు.
దీనివల్ల ఖజానాపై రూ.3,600 కోట్లు వేతనాల రూపంలో అదనపు భారం పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ వెల్లడించారు. ప్రతి ఉద్యోగి సంతోషంగా ఉండాలని తాను మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.