బ్యాంక్ వద్ద కాపుగాచి...వెంబడించి... పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు
నందిగామ పట్టణంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సినీ పక్కీలో ఓ వ్యక్తివద్ద దాదాపు మూడు లక్షల రూపాయలు దోచుకుని పరారయ్యారు.
కృష్ణాజిల్లా: నందిగామలో పట్టపగలే దోపిడిదొంగలు రెచ్చిపోయారు. ఓ బ్యాంకు వద్ద కాపుగాచి ఓ వ్యక్తి వద్ద దాదాపు మూడు లక్షల వరకు దోచుకుని పరారయ్యారు. పట్టన నడిబొడ్డును... అత్యంత రద్దీగా వుండే ప్రాంతంలో దొంగలు తమ పనిపి సాఫీగా పూర్తిచేసుకుని పరారయ్యారు.
ఈ దోపిడీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నందిగామ మండలం పాత బెల్లంకొండవారిపాలెం చెందిన పెట్యాల రాజేష్ అనే వ్యక్తి వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంక్ నుండి గోల్డ్ లోన్ తీసుకున్నాడు. నందిగామ జాతీయ రహదారిపై పక్కన గ్రామీణ సిండికేట్ బ్యాంకులో తన వద్దగల బంగారాన్ని కుదువపెట్టి మూడు లక్షల ఏడు వేల రూపాయలను పొందాడు.
అయితే బ్యాంక్ వద్ద దోపిడీ కోసం కాపుగాసిన దొంగల ముఠా ఈ విషయాన్ని గమనించింది. బ్యాంక్ లో నుండి డబ్బులతో బయటకు వచ్చిన రాజేశ్ ను ఫాలో అవుతూ అదును కోసం ఎదురుచూసింది.
ఈక్రమంలో నందిగామ గాంధీ సెంటర్ దగ్గర్లోని ఓ ఎలక్ట్రానిక్ షాప్ లో ఏదో కొనుగోలు చేయడానికి రాజేశ్ వెళ్లాడు. ఇదే మంచి సమయంగా బావించిన దొంగలు బైక్ లో వున్న డబ్బుల సంచిని తస్కరించి ఉడాయించారు.
ఎలక్ట్రానిక్ షాప్ లోంచి బయటకు వచ్చిన రాజేశ్ ఈ విషయాన్ని గమనించి లబోదిబోమన్నాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని సిసి కెమెరాలు, బ్యాంక్ వద్ద, సంఘటన స్థలంలో వున్న సిసి కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భారీ మొత్తంలో డబ్బుతో ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా వుండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. అప్రమత్తంగా లేకుంటే ఇలాగే దొంగలు రెచ్చిపోయే అవకాశాలు వుంటాయని పోలీసులు తెలిపారు.