వరుస పరువు హత్యలపై సిపిఐ సీరియస్... ముఖ్యమంత్రికి లేఖ
ఆంధ్ర ప్రదేశ్ లోో జరుగుతున్న వరుస పరువు హత్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. దళిత మహిళ హోమంత్రిగా వున్న రాష్ట్రంలోనే దళితులకు గౌరవం లేకుండాపోావడం దురదృష్టకరమన్నారు.
విజయవాడ: ఇటీవల రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పరువు హత్యలు ఆందోళనను కలిగిస్తున్నాయని సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. వీటిని ఆపేందుకు ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవాలంటూ ఆయన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు.
ఇటీవల చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం ఉసరపెంటలో పరువుహత్య జరిగిన విషయం తెలిసిందే. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే కుప్పం నియోజకవర్గంలో రెడ్లపల్లిలో మరో ఘాతుకం చోటుచేసుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకుని తమ పరువు బజారుపాలు చేసిందన్న కోపంతో చందన అనే యువతిని ఆమె తల్లితండ్రులే అతి దారుణంగా హతమార్చారు. హత్య చేసి శవం కనబడకుండా మాయం చేయడానికి ప్రయత్నించారు. మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారు.
సాక్షాత్తూ ఒక దళిత మహిళ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నప్పటికీ దళిత, మైనారిటీలకు రక్షణ కరువవ్వడం బాధాకరమని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు. తక్షణమే పరువు హత్యలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.