ఆదర్శ పోలీస్: తల్లి చనిపోయినా అంత్యక్రియలకు వెళ్లని ఎస్సై
కరోనా వ్యాప్తికి తాను కారణం కాకూడదని భావించి ఓ ఎస్సై పుట్టెడు దు:ఖాన్ని గుండెల్లో దాచుకుని కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు.
విజయవాడ: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ను లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినా ప్రజలు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఇష్టం వచ్చినట్లు, అవసరం లేకున్నా ప్రజలు బయటకు వస్తూ నిబంధనలు ఉళ్లంగిస్తున్నారు.
కానీ ఓ పోలీస్ అధికారి మాత్రం పుట్టెడుదు:ఖంలో వున్నా... ఎవ్వరూ అడ్డుకునే అవకాశం లేకున్నా ఆదర్శంగా నిలిచాడు. సొంత తల్లి చనిపోయినా నిబంధనలను ఉళ్లంగించి కరోనా వ్యాప్తికి కారణం కాకూడదని భావించి పోలీస్ అధికారి తల్లి అంత్యక్రియలకు కూడా వెళ్లలేదు.
పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేస్తున్న శాంతారాం కన్నతల్లి ఇవాళ చనిపోయింది. అయితే తల్లిని చివరిసారి చూడాలంటే ప్రభుత్వ నిబంధనలు ఉళ్లంగించి నాలుగు జిల్లాలను దాటుకుని సొంతజిల్లాకు వెళ్లాల్సి వుంటుంది. 40 చెక్ పోస్టులు దాటాలి... దీనివల్ల కరోనా వ్యాప్తికి ఆస్కారం ఉంది.
చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ అధికారి అయినా తానే చట్టాలను ఉళ్లంగించడం నచ్చని సదరు పోలీస్ తల్లి అంత్యక్రియలకు కూడా దూరమయ్యాడు. పెద్ద కొడుకుగా తానే అన్ని ముందుండి చూసుకోవాల్సి వుండగా అలా చేయలేకపోతున్నానని శాంతారాం ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియలు జరపాలని తన తమ్ముడికి చెప్పినట్లు ఎస్సై తెలిపాడు.
రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో వున్నపుడు విధులు నిర్వర్తిస్తేనే తన తల్లి ఆత్మకు శాంతి చేకూరుతుందని తీవ్ర దు:ఖంతోనే ఎస్సై తెలిపారు. ప్రజలు కూడా అత్యవసరాలు అయితేనే బయటకు రావాలని శాంతారాం సూచించారు.