పదో తరగతి పేపర్లు కొట్టేసినోడు సీఎం... అందుకే కొరియా కరోనా: జగన్ పై బుద్దా సైటైర్లు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిలపై టిడిపి అధికార ప్రతినిది, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కరోనా వైరస్ గురించి సీఎం చేసిన కామెంట్స్ ను గుర్తుచేస్తూ సెటైర్లు విసిరారు.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిలపై టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి సోషల్ మీడియా వేదికన విరుచుకుపడ్డారు. గతంలో కరోనా వైరస్ తగ్గాలంటే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ సెటైర్లు విసిరారు.
''పదో తరగతి లో పేపర్లు కొట్టేసిన వాడు ముఖ్యమంత్రి అయితే కరోనా కొరియా నుండి వస్తుంది.పేరాసిట్మాల్ వేస్తే తగ్గిపోతుంది. బ్లీచింగ్ వేస్తే చచ్చిపోతుంది ఎంపీ విజయసాయి రెడ్డి గారు'' అంటూ ఎద్దేవా చేశారు.
''కరోనా మీకు రాకుండా జాగ్రత్త పడండి సాయి రెడ్డి గారు. లేకపోతే వైఎస్ జగన్ గారు డాక్టర్ అవతారమెత్తి బ్లీచింగ్ పౌడర్ తో మీ వెంట పడతారు'' అంటూ సెటైర్లు విసిరారు.
''విజయసాయి రెడ్డి గారు పేరాసిట్మాల్ వికటించిందా పిచ్చి కూతలు కూస్తున్నారు. కొంపతీసి వైఎస్ జగన్ గారు చెప్పారని మొహానికి బ్లీచింగ్ పౌడర్ రాసుకున్నారా? తేడాగా మాట్లాడుతున్నారు'' అని బుద్దా వెంకన్న విమర్శించారు.
''కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడంలో పేటెంట్ రైట్స్ జగన్ గారికి ఉన్నాయనే విషయం మర్చిపోయారా? అధికారులను దొంగ పనులకు వాడుకొని జైలుకి పంపిన చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నావా? మీ క్రిమినల్ గేమ్స్ కి ఎండ్ కార్డు పడే రోజులు దగ్గర పడ్డాయి జాగ్రత్త'' అంటూ హెచ్చరించారు.
''అధికారుల లేఖలతో వైఎస్ జగన్ గారి తో సహా మీకు కూడా మైండ్ బ్లాంక్ అయ్యినట్టు ఉంది ఎంపీ విజయసాయి రెడ్డి గారు. అధికార దాహంతో స్థానిక ఎన్నికల సందర్భంగా దౌర్జన్య పర్వానికి తెరలేపారు, హత్యాయత్నాలు చేసారు. పొలిసు వ్యవస్థని బ్రష్టు పట్టించారు. ఓటమి భయంతో నీచమైన పనులు చేసారు.''
''ఆఖరికి ఎన్నికల సంఘం కమిషనర్ ని సైతం బూతులు తిడుతూ బెదిరించారు.మీరు చేస్తున్న అకృత్యాలను పూసగుచ్చినట్టు రమేష్ కుమార్ గారు కేంద్రానికి లేఖ రాసారు. విచారణ ప్రారంభమైంది చేసిన అరాచకాలకు త్వరలోనే ఏ 1, ఏ 2 లతో సహా విచ్చలవిడిగా నోటితో రెచ్చిపోయిన వారు సైతం ఊచలు లెక్కపెట్టడం ఖాయం'' అని తీవ్రస్థాయిలో జగన్, విజయసాయి రెడ్డిలపై బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు.