విజయవాడ: కారులో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు మృతిచెందిన విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. సరదాగా ఆడుకుంటూ వెళ్లి కారులో ఎక్కగా డోర్‌ లాక్‌ పడిపోవడంతో లోపల ఉన్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. 

వివరాల్లోకి వెళితే... కృష్ణా కొండూరు మండలం రేపూడి తండాకు చెందిన బాణవత్ కోల-లక్ష్మి దంపతులకు శ్రీనివాస్(5), యమున(4) అనే ఇద్దరు పిల్లలున్నారు. అయితే మంగళవారం ఈ అన్నాచెల్లెలు ఇంటిబయట ఆడుకుంటుండగా ప్రమాదానికి గురయ్యారు. వీరిద్దరు ఇంటి బయట పార్క్ చేసిన కారులోకి ఎక్కి డోర్ వేసుకోగా లాక్ పడింది. దీంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. 

చిన్నారులిద్దరికి డోర్ తీయడం తెలియకపోవడం, తల్లిదండ్రులు వారు కారులో చిక్కుకున్నట్లు గుర్తించకపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సాయంత్రానికి కూడా పిల్లలు ఇంట్లోకి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతకగా కారులో విగతజీవులుగా చిన్నారులు కనిపించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.