విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బెజవాడ గ్యాంగ్ వార్ లో కొత్త ముఖాలు వెలుగు చూస్తున్నాయి. రెండు గ్యాంగ్ ల మధ్య జరిగిన గొడవలో నాగబాబు అనుచరుడు దాస్ కూడా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. గొడవ జరిగిన తర్వాత దాస్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. పోలీసులు ఇప్పటికే నాగబాబును తమ అదుపులోకి తీసుకున్నారు. 

సందీప్ వర్గాన్ని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సందీప్ వర్గానికి చెందిన 11 మందిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. పండు వర్గానికి చెందినవారిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా సందీప్ వర్గాన్ని అరెస్టు చేసే పనిలో పడ్డారు. 

Also Read: బెజవాడ గ్యాంగ్ వార్: పండు ముఠా దాడిలోనే సందీప్ మృతి, అరెస్టయిన 13 మంది వీరే..

గుంటూరు జిల్లాకు చెందిన ఓ రౌడీ షీటర్ ను కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఘర్షణలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పండు సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యే అవకాశం ఉంది. అయితే, అతని డిశ్చార్జీ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.   

గత నెల 30వ తేదీన విజయవాడలోని తోటవారి వీధిలో సందీప్, పండు వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ మధ్య జరిగిన ఘర్షణలో సందీప్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రస్తుతం పండు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

సందీప్ హత్య కేసులో విజయవాడ పోలీసులు ఇప్పటికే 13 మందిని అరెస్టు చేశారు. ఈ రెండు వర్గాల మధ్య భూవివాదమే ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది.