బెజవాడ బేజారు: లారీ డ్రైవర్ ద్వారా 20 మందికి కరోనా పాజిటివ్
కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ రోజు 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 కేసులు కృష్ణలంక నుంచే నమోదు కావడం విశేషం. లారీ డ్రైవర్ ద్వాారా 20 మందికి సోకినట్లు భావిస్తున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో శనివారంనాడు తాజాగా కృష్ణా జిల్లాలో కొత్తగా 25 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కృష్ణలంకకు చెందిన ఓ లారీ డ్రైవర్ కారణంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగినట్లు భావిస్తున్నారు.
లారీ డ్రైవర్ ద్వారా నిన్నటి వరకు 8 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ రోజు 20 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ రోజు కృష్ణా జిల్లాలో నమోదైన 25 కేసుల్లో 18 కేసులు కృష్ణ లంక ప్రాంతానికి చెందినవే కావడం విశేషం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు వెళ్లి వచ్చిన లారీ డ్రైవర్ కారణంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ రోజు నమోదైన 25 కేసుల్లో కృష్ణలంకలో 18, నూజివీడిలో 2, జగ్గయ్యపేటలో 2, న్యూ రాజీవ్ నగర్ లో 1, గోపవరం ముసునూరులో 1, విజయవాడ నగరంలో 1 కేసులు రికార్డయ్యాయి.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వణుకు పుట్టిస్తోంది. ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేయి దాటింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో తాజాగా 61 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ తో మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 31కి చేరుకుంది.
రాష్ట్రంలో 171 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 814గా ఉంది. గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 25 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి.
కర్నూలు జిల్లా మొత్తం 275 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు 209కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కు దూరంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో మాత్రం కేసులు నమోదు కాలేదు. చిత్తూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో కొత్తగా కేసులేమీ నమోదు కాలేదు. కొంత వరకు ఈ మూడు జిల్లాలకు ఊరట లభించినట్లే.
కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వల్ల అత్యధికంగా మంది మరణించగా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎనిమిదేసి మంది మరణించారు. అఅనంతపుూరం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మరణించారు.
జిల్లాలవారీగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలా ఉంది....
అనంతపురం 51
చిత్తూరు 73
తూర్పు గోదావరి 37
గుంటూరు 209
కడప 55
కృష్ణా 127
కర్నూలు 275
నెల్లూరు 72
ప్రకాశం 53
శ్రీకాకుళం 3
విశాఖపట్నం 22