హోమంత్రి ఎకసెక్కాలు ఎక్కువ రోజులుండవు.. పదవి ఎప్పుడు పీకేస్తారో తెలియదు: పేర్ని నాని| Asianet Telugu
డ్రామాలు ఆడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వారు రాజకీయాల్లో ఎవరూ లేరని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కామ్‌లో రాజమండ్రి జైలుకు వెళ్ళినప్పుడు చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడారో మరిచిపోయారా అని ప్రశ్నించారు. రామగిరిలో వైయస్ జగన్‌కు భద్రతావైఫల్యంను కప్పిపుచ్చుకునేందుకు అవ్వన్నీ డ్రామాలంటూ చంద్రబాబు మాట్లాడటంపై తీవ్రంగా మండిపడ్డారు. "జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న మాజీ సీఎం వైయస్ జగన్‌కు భద్రత కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ అవన్నీ అనంతపురం డ్రామాలని చంద్రబాబు ఎగతాళి చేశారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలంటూ ఆడినవే అసలైన డ్రామాలు. జైలు పోలీసులు మినహా మరెవ్వరూ చంద్రబాబు ఉన్న గదుల వైపు వెళ్ళే అవకాశమే లేకుండా బందోబస్త్ ఉంటే, తనకు రక్షణ లేదంటూ గగ్గోలు పెట్టడం డ్రామా కాదా? జైలుకు వెళ్ళే వరకు ఆరోగ్యంగా ఉన్న చంద్రబాబు, లోనికి వెళ్ళగానే హటాత్తుగా అలర్జీ వచ్చిందని చేసినవి నాటకాలు కాదా? జైలులో చంద్రబాబు సత్యాగ్రహం చేస్తున్నారంటూ తెలుగుదేశం వారితో డ్రామాలు ఆడించడం మరిచిపోయారా? తన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ తన పార్టీనేతలతో అబద్దాలు చెప్పించారు. డెబ్బై అయిదేళ్ళ వయస్సున్న తనతో పరుగుపందెంకు రావాలని వైయస్ఆర్‌సీపీ వారిని సవాల్ చేసిన చంద్రబాబు, జైలుకు వెళ్ళగానే ఆరోగ్యం ఆందోళనకరమని ప్రచారం చేసుకున్నారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయని, ఆయన ప్రాణాలకు దోమల వల్ల ముప్పు ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి, బరువు తగ్గారు, గుండె సమస్యలు పెరిగాయి, ఎక్కడకు వెళ్ళినా అంబులెన్స్ లేకుండా వెళ్లకూడదంటూ న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలు డ్రామాలు కాదా? రాజకీయాల్లో డ్రామాలు చేయాలంటే అది చంద్రబాబుకే సొంతం. గతంలో తన చేతికి దెబ్బతగిలిందంటూ కట్టుతో వచ్చి, ఆ కట్టులో ఒకసారి కుడిచేయి, మరోసారి ఎడమచేయి పెట్టిన ఘనుడు చంద్రబాబు. ఇక హోంమంత్రి అనిత 1100 మంది పోలీసులను రామగిరి పర్యటనలో భద్రత కోసం నియమించామని చెప్పారు. పులివెందుల ఎమ్మెల్యేకు 200 మంది పోలీసులను హెలిప్యాడ్ వద్ద భద్రత కోసం నియమించాం అంటూ వైయస్ జగన్‌ను హేళనచేసేలా మాట్లాడారు. హోమంత్రి ఎకసెక్కాలు ఎక్కువ రోజులు ఇలాగే ఉండవు. మీ పదవి ఎప్పుడు చంద్రబాబు పీకేస్తాడో తెలియదు. ఇప్పటికే పవన్‌కళ్యాణ్ ద్వారా మీకు హెచ్చరిక కూడా చేయించారు. పదవిలో ఉన్నారని ఏదిపడితే అది మాట్లాడితే కుదరదు" అని హెచ్చరించారు.