బిజెపితో డ్యూయెట్లు పాడుకున్న చిన్నదొరా... నిరుద్యోగం గుర్తుకొచ్చిందా!: కేటీఆర్ కు షర్మిల కౌంటర్
నిర్మల్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణలో నిరుద్యోగం, కాళేశ్వరం అవినీతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
నిర్మల్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణలో నిరుద్యోగం, కాళేశ్వరం అవినీతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ హామీ ఏమయ్యిందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించడంపై షర్మిల స్పందించారు. ఇంతకాలం బిజెపితో డ్యూయెట్లు పాడుకోవడం అయిపోయింది... ఇప్పుడు మునుగోడు ఎన్నికలు వచ్చి మీకు మీకు పడటంలేదు కాబట్టే చిన్న దొరకు నిరుద్యోగం గుర్తొచ్చిందని షర్మిల ఎద్దేవా చేసారు.
నమో అంటే నమ్మించి మోసం చేయడమని కేటీఆర్ చెబుతున్నారు... మరి మీరు చేసింది మోసం, వెన్నుపోటు, దగా కాదా అని నిలదీసారు. ఇంటికో ఉద్యోమని చెప్పి మీరు చేసింది మోసమే కదా... తలకాయ ఎక్కడ పెట్టుకుంటారంటూ మండిపడ్డారు. మీ దిక్కుమాలిన పాలన వల్ల నిరుద్యోగంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో వుందన్నారు. అలాంటిది మీరు నిరుద్యోగం గురించి మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించడమేనని షర్మిల మండిపడ్డారు.