పోలీస్ పహారాలో సింగరేణి నిర్వాసితుల ఇళ్ల కూల్చివేత... పెద్దపల్లి జిల్లాలో ఉద్రిక్తత
పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం లద్నపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం లద్నపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓసిపీ 2 విస్తరణలో భాగంగా లద్నపూర్ గ్రామాన్ని సింగరేణి అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున పోలీస్ బందోబస్తు, జేసిబిలతో సింగరేణి అధికారులు లద్నాపూర్ చేరుకుని ఇళ్ల కూల్చివేత ప్రారంభించారు. ఓసీపీ 2 పక్కన ఉన్న ఇళ్లలోని వారిని బలవంతంగా బయటకు తీసుకువచ్చి సామాగ్రి వుండగానే కూల్చివేత చేపట్టారు.
తమ ఇళ్ల కూల్చివేతలను నిరసిస్తూ బాధితులు ఓసీపీ2 గేట్ ముందు ధర్నా చేపట్టారు. సింగరేణి ఉద్యోగులు మైన్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఓసీపీ 2 క్వారీలోకి చొచ్చుకువెళ్లేందుకు నిర్వాసితులు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను తోసుకుంటూ కొందరు క్వారీలోకి వెళ్ళి నిరసన తెలిపారు. నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.