ఎముకలు కొరికే చలిలో బాలికల ఆందోళన... ఇదీ కేటీఆర్ ఇలాకాలో పరిస్థితి...
సిరిసిల్ల : ప్రిన్సిపాల్, వార్డెన్, అటెండర్ వేధింపులు భరించలేకపోతున్నామంటూ తెల్లవారుజామునే ఎముకలు కొరికే చలిలో స్కూల్ విద్యార్థునులు రోడ్డుపై ఆందోళనకు దిగారు.
సిరిసిల్ల : ప్రిన్సిపాల్, వార్డెన్, అటెండర్ వేధింపులు భరించలేకపోతున్నామంటూ తెల్లవారుజామునే ఎముకలు కొరికే చలిలో స్కూల్ విద్యార్థునులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. వెంటనే తమను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నవారిని తొలగించి ప్రశాంతంగా చదువుకునేలా చూడాలంటూ బాలికలు డిమాండ్ చేసారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో బాలికలు ధర్నాకు దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల లోని తెలంగాణ స్టేట్ ఏకలవ్య బాలికల మోడల్ రెసిడెన్సియల్ స్కూల్ విద్యార్థినులు తెల్లవారుజామున 5 గంటలకే ఆందోళనకు దిగారు. హాస్టల్ నుండి చల్లటి చలిలోనే బయటకు వచ్చిన 50 మంది విద్యార్థినులు తమ సమస్యలను బయటపెట్టారు. ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమతో దురుసుగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నారని బాలికలు ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బైఠాయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేసారు. నిరసనకు దిగిన బాలికలకు విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి.