బిల్లుల కోసం సర్పంచ్ ఆత్మహత్యాయత్నం ... పెద్దపల్లి జిల్లాలో దారుణం

పెద్దపల్లి :సొంత డబ్బులు లక్షలకు లక్షలు ఖర్చుచేసి గ్రామంలో అభివృద్ది పనులు చేపట్టాడు ఆ సర్పంచ్.

First Published Mar 2, 2023, 11:19 AM IST | Last Updated Mar 2, 2023, 11:19 AM IST

పెద్దపల్లి :సొంత డబ్బులు లక్షలకు లక్షలు ఖర్చుచేసి గ్రామంలో అభివృద్ది పనులు చేపట్టాడు ఆ సర్పంచ్. తీరా ప్రభుత్వం నుండి బిల్లులు వచ్చాక వాటిని విడుదల చేసేందుకు ఎంపిడివో లంచం డిమాండ్ చేసాడు.ఇలా దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డట్లు ప్రభుత్వం బిల్లులిచ్చినా అధికారి మాత్రం అడ్డుపడ్డాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురయిన సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. 

సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ సర్పంచ్ అన్నాడి రవీందర్ రెడ్డి వివిధ అభివృద్ది పనుల కోసం సొంతంగా దాదాపు రూ.25 లక్షలు ఖర్చుచేసాడు.ఈ డబ్బులకు సంబంధించిన బిల్లులను ఇటీవల ప్రభుత్వం మంజూరుచేసింది. అయితే ఈ బిల్లులు విడుదల చేయాలంటే తనకు రూ.15,000 లంచం ఇవ్వాలని ఎంపిడివో ఫయాజ్ అలీ డిమాండ్ చేసాడట.అయితే సర్పంచ్ ఐదు వేలు ఇవ్వగా మిగతా పదివేలు ఇస్తేనే పని జరుగుతుందని ఎంపిడివో కరాకండీగా చెప్పాడట. దీంతో గత 15 రోజులుగా తిరుగుతున్న సర్పంచ్ రవీందర్ తీవ్ర ఒత్తిడికి గురయి ఎంపిడివో కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.వెంటనే కార్యాలయ సిబ్బంది అతడిని స్థానిక హాస్పిటల్ కు తరలించగా మైరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.