పో పో బతుకమ్మ పోయి రావమ్మా.. (వీడియో)
ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ బతుకమ్మ. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగిపొరలే కాలంలో బతుకమ్మ పండుగ వస్తుంది. భూమితో, జలంతో ఉన్న మానవ అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండుగ బతుకమ్మ.
ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ బతుకమ్మ. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగిపొరలే కాలంలో బతుకమ్మ పండుగ వస్తుంది. భూమితో, జలంతో ఉన్న మానవ అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండుగ బతుకమ్మ.
జానపదుల ఇలవేల్పు బతుకమ్మ. ముగ్గురమ్మల మూలపుటమ్మ బతుకమ్మ. అమావాస్యతో మొదలయ్యే బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిదిరోజులు ఆడతారు. తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో పిలుస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఈ రోజు బతుకమ్మను ఆడరు. ఏడో రోజు వేపకాయ బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, చివరి రోజు సద్దుల బతుకమ్మ.
బతుకమ్మ తయారీ ఓ కళ. పువ్వుమీద పువ్వు పెట్టి గుండ్రంగా, గోపురంలా పేర్చడం అందరికీ ఒంటపట్టే విద్య కాదు. తంగేడు, గునుగు, కట్ల, బంతి, పట్టుకుచ్చులు, చామంతులు దొంతరలు దొంతరలుగా పేర్చుకుంటూ వెళ్లడం చూడముచ్చటైన వేడుక.
ఎంగిలిపూల బతుకమ్మ రోజు ఒక్కేసి పువ్వేసి చందమామ అని మొదలయి రోజుకో ప్రత్యేకమైన పాటతో సాగి చివరికి సద్దుల బతుకమ్మ రోజు వచ్చేసరికి ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ అంటూ తాము పేర్చిన పూలను పొగుడుతూ పాటను కొనసాగిస్తారు.
బతుకమ్మకు చప్పట్ల నివేదన ఈ పండుగ. ఓ క్రమపద్ధతిలో లయబద్ధంగా రెండు చేతులతో చప్పట్లు కొడుతూ సాగే పండుగ పరమార్థం ఆరోగ్యమే.
శరీరానికి చక్కని వ్యాయామం ఈ పండుగ. బతుకమ్మను పేర్చడం ఓ ఆసనం. బతుకమ్మను నెత్తిమీద పెట్టుకుని కాలినడకన ఆట ప్రదేశానికి చేరడం మరో ఆసనం. పాదాలు లయబద్దంగా కదులుతుంటే నడుమును వంచుతూ లేస్తూ చప్పట్లు ఒకటి దూరంగా మరోటి దగ్గరగా కొడుతూ గుండ్రంగా తిరగడం మరో ఆసనం. అలా అలుపన్నది లేకుండా గంటల తరబడి ఆడడం ఆడపడుచుల గొప్పదనం.
బతుకమ్మ పండుగకు ఆరోగ్యపరమైన ప్రాధాన్యత కూడా ఉంది. ఈ ఆటద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని వైద్య నిపుణులే నిర్థారించారు.
రకరకాల ధాన్యాలతో చేసే ప్రసాదాల వల్ల శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. బతుకమ్మ తొమ్మిదిరోజులు, ఇళ్లు చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈగలు,దోమలు వ్యాప్తి చెందవు. దీంతో అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. మహిళలు లయబద్దంగా కిందికి మీదికి వంగుతూ లయబద్దంగా ఆడడం వల్ల శరీరంలోని అవయవాలన్నింటికీ వ్యాయామం లభిస్తుంది. ఆటసమయంలో కొట్టే చప్పట్ల వల్ల శరీరంలోని అవయవాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మలినాలు, రోగ కారకాలు దూరమవుతాయి.
ఆరోగ్యం, ఐకమత్యం, భగవతారాధనతో కూడిన బతుకమ్మ పండుగ తొమ్మిదిరోజులపాటూ సాగే పాటకచేరీ..అద్భుతమైన సంప్రదాయం...బతుకమ్మ అంటే కేవలం పూలు పేర్చడం కాదు బతుకును పేర్చుకోవడం..కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం..బతుకు విలువ తెలుసుకోవడం..మరింతకాలం ఆరోగ్యంగా బతకడానికి కావల్సిన కృషి చేయడం.