జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దుకు తీర్మానం... మున్సిపల్ కౌన్సిల్ కీలక నిర్ణయం

జగిత్యాల : అన్నదాతల ఆందోళనలతో దిగివచ్చిన జగిత్యాల మున్సిపాలిటీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

First Published Jan 20, 2023, 3:39 PM IST | Last Updated Jan 20, 2023, 3:39 PM IST

జగిత్యాల : అన్నదాతల ఆందోళనలతో దిగివచ్చిన జగిత్యాల మున్సిపాలిటీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక రైతుల అభ్యంతరాలు, ఆందోళనల నేపథ్యంలో జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఈ తీర్మానం కాపీని ప్రభుత్వానికి పంపించి ప్రస్తుత మాస్టర్ ప్లాన్ రద్దుకు కృషిచేస్తామని మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు తెలిపారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ లో పరిశ్రమల ఏర్పాటు, రిక్రియేషన్ కోసమంటూ పచ్చటి పొలాలను లాక్కునేందుకు ప్రభుత్వం సిద్దమయ్యిందంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో మాస్టర్ ప్లాన్ ను అమలుచేయనివ్వబోమంటూ రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. గత పదిరోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనలతో దిగివచ్చిన జగిత్యాల మున్సిపాలిటీ పాలకవర్గం ఇవాళ సమావేశమై మాస్టర్ ప్లాన్ రద్దుకు తీర్మానం చేసింది. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూమర్, మున్సిపల్ చైర్మన్ శ్రావణి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.