తల్లిదండ్రులు రాలేదని మనస్తాపం... అందరూ చూస్తుండగానే భవనం పైనుండి దూకిన బాలిక
కరీంనగర్ : అందరు విద్యార్థుల తల్లిదండ్రులు చూడటానికి వచ్చారు...
కరీంనగర్ : అందరు విద్యార్థుల తల్లిదండ్రులు చూడటానికి వచ్చారు... తన తల్లిదండ్రులు రాకపోవడంతో ఆ బాలిక లేతమనసు గాయపడింది. దీంతో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని భావించిన బాలిక క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకుంది. హాస్టల్ భవనం మూడో అంతస్తు పైనుండి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి యత్నించిన పదో తరగతి విద్యార్థిని హాసినిని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శించారు. కాలు విరిగి తీవ్ర గాయాలపాలైన బాలికను కరీంనగర్ హాస్పిటల్ నుండి హైదరాబాద్ గాంధీకి తరలిస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్ ఆపిన ఎమ్మెల్యే బాలికతో పాటు కుటుంబసభ్యులతో మాట్లాడారు. గాంధీ హాస్పిటల్ ఆర్ఎంఓ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే రవిశంకర్ సూచించారు.