కల్వకుంట్ల కుటుంబానికి ఆపదొస్తే చాలు తెలంగాణ సెంటిమెంట్..: డికె అరుణ
హైదరాబాద్ : డిల్లీ లిక్కర్ స్కాం పై విచారణ జరుపుతున్న ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులివ్వడంపై బిజెపి నాయకురాలు డికె అరుణ స్పందించారు.
హైదరాబాద్ : డిల్లీ లిక్కర్ స్కాం పై విచారణ జరుపుతున్న ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులివ్వడంపై బిజెపి నాయకురాలు డికె అరుణ స్పందించారు. కవితకు ఈడీ నోటీసుల వెనక బిజెపి కక్షసాధింపు ఏమీ లేదన్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లే అధికారంలో వచ్చింది మొదలు అందరిపై కక్షసాధింపుకు దిగిన బిఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి అందరూ అలాగే చేస్తారని అనిపిస్తున్నట్లుందని అన్నారు. కవితకు నిజంగానే లిక్కర్ స్కామ్ తో సంబంధం లేకుంటే ఈడీ విచారణలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవచ్చు... నిజాయతీని నిరూపించుకోవచ్చని అన్నారు.కానీ ఇప్పటికే అరెస్టయిన వారు పదే పదే కవిత పేరు ఎందుకు చెబుతున్నారో తెలియాలన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి ఆపద వచ్చిన ప్రతీ సారి తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటున్నారని... కవితను విచారణకు పిలిస్తే తెలంగాణ సమాజాన్నే అవమానిస్తున్నట్లు బిఆర్ఎస్ ప్రచారం చేస్తోందన్నారు. కల్వకుంట్ల కుంటుంబంపై ఆరోపణలు వస్తే తెలంగాణ సమాజమే ఎదుర్కొన్నట్లు, తెలంగాణ సమాజమే స్కామ్ కు పాల్పడినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఈడీ నోటీసులు వస్తాయని సమాచారం వుండే కవిత మహిళా రిజర్వేషన్ల ధర్నా డ్రామా ఆడుతున్నట్లు అనుమానాలున్నాయని డికె అరుణ ఆరోపించారు.