రోడ్డుపైనే కట్టెల పొయ్యిపెట్టి మంత్రిగారి వంటావార్పు... కరీంనగర్ లో గంగుల వినూత్న నిరసన
కరీంనగర్ :కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెంచడాన్ని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి ఆందోళనకు పిలుపునిచ్చింది.
కరీంనగర్ :కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెంచడాన్ని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అధికార బిఆర్ఎస్ నాయకులు రోడ్లపైకి వచ్చారు. కరీంనగర్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వినూత్ని రీతిలో నిరసన తెలిపారు. రోడ్డుపైనే కట్టెల పొయ్యి పెట్టి వంటావార్పు చేపట్టారు. మంత్రి గంగుల కమలాకర్ ఈ ఆందోళనలో పాల్గొని గరిటెతిప్పారు. 'బిజెపి హటావో - దేశ్ బచావో'' అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో ధర్నా ప్రాంగణం మారుమోగింది. గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ ధరను మరోసారి రూ. 50 పెంచింది కేంద్ర ప్రభుత్వం. అలాగే వాణిజ్య అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్లపై ఏకంగా రూ.350 పెంచుతున్నట్లు కేంద్రం నిన్న ప్రకటించింది. దీంతో ఇప్పటికే సిలిండర్ ధరల భారాన్ని ప్రజలు మోయలేకపోతున్నారని... మళ్లీ ధరలు పెంచి సామాన్యుల జేబులు ఖాళీ చేయవద్దంటూ బిఆర్ఆర్ పార్టీ మండిపడుతోంది. ఈ క్రమంలోనే సిలిండర్ల ధరల పెంపును నిరసిస్తూ ఇవాళ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.