Asianet News TeluguAsianet News Telugu

సిక్కు ప్రముఖులతో మోడీ భేటీ.. కాషాయ కండువా తలకు చుట్టి చిరునవ్వులు (వీడియో)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (narendra modi) - సిక్కు (sikh) వర్గానికి చెందిన కొందరు ప్రముఖులతో శుక్రవారం సమావేశం అయ్యారు. రెండు రోజుల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రధాని వారితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

దేశంలోని సిక్కు (sikh leaders) మతానికి చెందిన ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) శుక్రవారం ఆతిథ్యం ఇచ్చారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసం 7 లోక్‌ కల్యాణ్ మార్గ్‌లో మోదీ.. సిక్కు నేతల ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం కొందరు సిక్కు నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై, ఆయన పని తీరుపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు.  ‘నా రక్తంలో సిక్కిజం ఉంది.. నా రక్తంలో సేవ ఉంది’ అని మోదీ తమతో అన్నారని యమునా నగర్‌లోని సేవాపంతి అధ్యక్షుడు మహంత్ కరమ్‌జిత్ సింగ్ తెలిపారు. 

సిక్కుల పట్ల మోదీకి ఉన్న ప్రేమ మాకు చాలా స్పష్టతను తెచ్చిపెట్టిందని ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా అన్నారు. ‘సిక్కు మతగ్రంథాలు, సిక్కు గురువులు, భాష, సేవలో సిక్కులు ఎలా నిమగ్నమై ఉన్నారనే దానిపై మోదీ తప్ప మరెవ్వరికీ అంతగా అవగాహన లేకపోవచ్చు’ అని న్యూఢిల్లీలోని సిక్కు ఫోరమ్ అధ్యక్షుడు రవీందర్ సింగ్ అహుజా అన్నారు. ‘మోదీ.. సిక్కులను, దేశాన్ని ప్రపంచ స్థాయిలో బలోపేతం చేశారు. దేశం కోసం సిక్కులు బలిదానంలో ఎంతో కృషి చేశారని ఆయనకు (ప్రధాని మోదీకి) తెలుసు.. సిక్కు సమాజం సేవకు అంకితం చేయబడింది’ అని మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని సింగ్ సభ గురుద్వారా సాహిబ్ అధ్యక్షుడు మంజిత్ సింగ్ భాటియా అన్నారు.

‘సిక్కుల కోసం మోదీ జీ చేసిన పని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం దీన్ని చేయడానికి సాహసించలేదు.. మా బ్లాక్ లిస్ట్ ముగిసింది’ అని పాటియాలాలోని యంగ్ ప్రోగ్రెసివ్ ఫోరమ్ అధ్యక్షుడు ప్రభలీన్ సింగ్ అన్నారు. ప్రధాని మోడీని కలిసిన వారిలో- ఢిల్లీ గురుద్వార కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్ సింగ్ సిచెవాల్, సేవాపంథీ అధ్యక్షుడు మహంత్ కరమ్‌జీత్ సింగ్, డేరాబాబా జంగ్ సింగ్, బాబా జోగా సింగ్, సంత్ బాబా మేజర్ సింగ్ వా, ముఖి డేరాబాబా తారా సింగ్ వా, జథేందర్ బాబా సాహిబ్ సింగ్‌జీ, సురీందర్ సింగ్, బాబా జస్సా సింగ్, శిరోమణి అకాలీ బుధ దాల్, డాక్టర్ హర్భజన్ సింగ్, సింగ్ సాహిబ్ జ్ఞాని రంజీత్ సింగ్, జథేందర్ తఖ్త్ ఉన్నారు.

కాగా.. పంజాబ్‌లో (punjab elections) ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. మొత్తం 117 స్థానాలకు గాను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకూ పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలోని 2,13,88,764 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా 24,689 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.