Palnadu Accident: మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించి ఎమ్మెల్యే పిన్నెల్లి
పల్నాడు జిల్లా రెంటచింతల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు.
పల్నాడు జిల్లా రెంటచింతల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గురజాల ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో 12మంది పరిస్థితి విషమంగా వుంది. మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ఇదే హాస్పిటల్ కు తరలించారు. దీంతో మృతులు, క్షతగాత్రుల కుటుంబసభ్యుల రోదనలతో హాస్పిటల్ ప్రాంగణం మారుమోగుతోంది. ఈ రోడ్డు ప్రమాద మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను పల్నాడు జిల్లా వైసిపి అధ్యక్షులు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. గాయపడిన వారిని అడిగి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుంటుందని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు ఏపీ పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ కేబీయస్ ప్రగతి కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ శొంటిరెడ్డి నర్సిరెడ్డి, నవులూరి భాస్కర్ రెడ్డి, మోర్తాల ఉమా, బ్రహ్మారెడ్డి, రామయ్య, కర్రా గిరి, గురజాల మున్సిపల్ వైస్ ఛైర్మన్లు,కౌన్సిలర్లు, తదితర నాయకులు కూడా పరామర్శించారు.