కళ్లకు గంతలు, మెడలో దండతో అర్ధనగ్నంగా... విశాఖలో నిరుద్యోగ జేఏసి వినూత్న నిరసన
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ నుండి రాజ్యసభకు తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలను పంపాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ నుండి రాజ్యసభకు తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలను పంపాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రతిపక్షాలే కాదు ప్రజలు, నిరుద్యోగ యువత సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నంలోని జివిఎంసి వద్దగల గాంధీ విగ్రహం వద్ద నిరుద్యోగ జేఏసీ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. కొందరు అర్ధనగ్నంగా మొడలొ దండ వేసుకుని, మరికొందరు నల్లటి గుడ్డతో కళ్ళకు గంతలు కట్టుకుని ప్రభుత్వానికి, సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఏపీలో ఇంతమంది నాయకులు వుండగా వారికి ఇవ్వకుండా తెలంగాణ వారికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే వెనుకబాటుకు గురయిన ఉత్తరాంధ్రకు వైసిపి ప్రభుత్వం మరింత అన్యాయం చేస్తోందన్నారు. ఏపీ నుండి రాజ్యసభకు ఎన్నికయిన తెలంగాణ వ్యక్తులు ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై ఏమైనా ప్రశ్నిస్తారా? అంటూ ప్రశ్నించారు. తక్షణమే ఏపీకి చెందిన వారికి రాజ్యసభ సీటు ఇవ్వాలని... అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని నిరుద్యోగ జేఏసి నాయకులు డిమాండ్ చేసారు.