అసెంబ్లీ ప్రాంగణంలో ప్లకార్డులు చేతబట్టి... జంగారెడ్డిగూడెం మరణాలపై టిడిపి ఆందోళన
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మరణాలపై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఇవాళ(మంగళవారం) కూడా దద్దరిల్లుతోంది.
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మరణాలపై ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఇవాళ(మంగళవారం) కూడా దద్దరిల్లుతోంది. జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న మరణాలకు కల్తీ మద్యమే కారణమని ఆరోపిస్తూ దీనిపై ప్రత్యేక చర్చ చేపట్టాలని టిడిపి డిమాండ్ చేస్తోంది. అయితే వైసిపి నాయకులు, ప్రభుత్వం మాత్రం ఈ మరణాలన్నీ సహజ మరణాలేనని అంటూ చర్చకు నిరాకరించారు. దీంతో అసెంబ్లీ ఎదుట టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు.
కల్తీ సారా మరణాలను ప్రభుత్వం సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని... 26 మంది చనిపోతే ప్రభుత్వంలో కనీస చలనం లేదని టిడిపి నాయకులు మండిపడ్డారు. జంగారెడ్డిగూడెం మరణాల పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. అలాగే రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేసారు. మరణాలను తేలిగ్గా తీసుకుంటున్నారని... సభలో చర్చకు అంగీకరించే వరకూ పోరాటం ఆగదని టిడిపి సభ్యులు తెలిపారు.