అమ్ముకునే వారికి కాదు పార్టీని నమ్ముకునోళ్లకే బాధ్యతలివ్వాలి..: కేశినేని నాని సంచలనం
విజయవాడ : తన తమ్ముడు కేశినేని చిన్ని రాజకీయంగా యాక్టివ్ కావడంపై టిడిపి ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
విజయవాడ : తన తమ్ముడు కేశినేని చిన్ని రాజకీయంగా యాక్టివ్ కావడంపై టిడిపి ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఫోటీ చేసే హక్కు వుంటుందని...మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అంతర్జాతీయ చీటర్ చార్లెస్ శోభరాజ్, కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపేవాళ్లకు కూడా ఫోటీ చేసే హక్కు వుంటుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నేను నీతిగా రాజకీయాలు చేయాలనుకుంటాను... అంతేగాని అవినీతికి పాల్పడటం కాదు అలాంటి వారిని వెనకేసుకోసుకు తిరగడం, కాంపౌండ్ చుట్టూ పెట్టుకోవడం చేయనన్నారు. అవినీతి పరులకు తాను ఆమడ దూరంలో వుంటానని అన్నారు. తన తమ్ముడు అయినప్పటికీ కేశినేని చిన్నికి మద్దతివ్వబోనని అన్నారు. చిన్నినే కాదు అలాంటి మరికొంతమంది మనుషులున్నారు.. వారికి కూడా సపోర్ట్ చేయబోనని అన్నారు. భూకబ్జాదారులు, సెక్స్ రాకెట్, పేకాట క్లబ్ నడిపేవాళ్ళను, రియల్ ఎస్టేట్ లో మోసాలు చేసేవారికి ఏమాత్రం మద్దతివ్వబోనని నాని అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని నాని అన్నారు. టిడిపి అధినేత ముఖ్యమంత్రి అవ్వాలి... అందుకు తగ్గట్లుగా పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఇందుకోసం పార్టీని అమ్ముకునే వారికంటే నమ్ముకున్న వారికి బాధ్యతలను అప్పచెప్పాలని ఎంపీ నాని సూచించారు.