జగ్గయ్యపేట మున్సిపల్ సమావేశంలో రసాభాస... టిడిపి కౌన్సిలర్ల అరెస్ట్
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం రసాభాసగా మారింది.
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ అనుమతి లేకుండానే పట్టణంలో విగ్రహాలను ఏర్పాటు చేయడం ఏమిటంటూ టిడిపి కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. పోడియం ముందుకు చేరుకుని టిడిపి కౌన్సిలర్లు బైఠాయించడంతో సభలో గందరగోళం నెలకొంది. బస్టాండ్ ఆవరణలో గ్రీనరీ డెవలప్మెంట్ కోసం తీసుకున్న ప్రదేశంలో నాయకుల విగ్రహాలను పెట్టడం సరికాదని.... రాత్రికి రాత్రే విగ్రహాలు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో టిడిపి కౌన్సిలర్లను నెల రోజులపాటు సస్పెండ్ చేసారు మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర. సస్పెన్షన్ తర్వాత కూడా టిడిపి కౌన్సిలర్లు బయటకు వెళ్లకుండా అక్కడే ఆందోళన కొనసాగించారు. దీంతో మున్సిపల్ ఛైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు 13మంది కౌన్సిలర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.