విజయవాడ కలకలం... రెండో భార్య కారులో భర్త డెడ్ బాడీ
విజయవాడ పడమటలంక వీఎంసీ స్కూల్ వద్ద రోడ్డుపక్కన పార్క్ చేసిన కారులో మృతదేహం కనిపించడం కలకలం రేపింది.
విజయవాడ పడమటలంక వీఎంసీ స్కూల్ వద్ద రోడ్డుపక్కన పార్క్ చేసిన కారులో మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ‘‘AP37 BA 5456’’ నెంబర్ గల ఇండికా కారులో డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులోంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి పేరు బాషా అని... కారు ఇతడి రెండో భార్య అరుణ కుమారి పేరుపై రిజిస్టరయి వున్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
దాదాపు మూడు రోజుల నుంచి కారు ఇక్కడే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇలా ప్రధాన రహదారిపై రోజుల తరబడి కారు నిలిపివుంచినా ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాలేదు. నైట్ రౌండ్స్ లో ఉన్న పోలీసులు సైతం గుర్తించకపోయారు. ఎక్కడో హత్యచేసి ఇక్కడికి తీసుకువచ్చి కారుతో సహా వదిలివెళ్లినట్లు అనుమానిస్తున్నారు. కారు పార్క్ చేసి వుంచిన ప్రాంతానికి సమీపంలో సిసి కెమెరాలకు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.