ఆర్మీ జవాన్ వద్దే లంచం తీసుకుంటూ ... అడ్డంగా బుక్కయిన ప్రకాశం ప్రభుత్వోద్యోగి
ప్రకాశం : దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బార్డర్లో కాపుకాసే సైనికులకు సైతం లంచావతారాల వేధింపులు తప్పడంలేదు.
ప్రకాశం : దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బార్డర్లో కాపుకాసే సైనికులకు సైతం లంచావతారాల వేధింపులు తప్పడంలేదు. ఆర్మీ జవాన్ అనే కనీస గౌరవం లేకుండా సొంత భూమి సర్వే రిపోర్ట్ కోసం లంచం డిమాండ్ చేసాడు ప్రభుత్వోద్యోగి. అయితే సదరు ఉద్యోగికి ఆర్మీ జవాన్ లంచమిస్తూ వీడియో తీసి బయటపెట్టడంతో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ లంచావతారం లీలలు బయటపడ్డాయి.
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం బసినిపల్లి గ్రామానికి చెందిన జవాన్ పవన్ కుమార్ కు ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. వ్యవసాయ భూమి సర్వే రిపోర్ట్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన చలాన్లు చెల్లించినా మరో 1500 రూపాయలు ఇవ్వాలని సర్వేయర్ రాజాబాబు డిమాండ్ చేసాడు. రూ.500 ఇస్తానన్నా ఒప్పుకోకుండా రూ.1000 లంచం ఇచ్చేవరకు ఒప్పుకోలేదు సదరు లంచగొండి అధికారి. దీంతో లంచమిస్తూ వీడియో తీసి బయటపెట్టాడు జవాన్ పవన్. దేశసేవ చేస్తున్న తమకే ఇలాంటి ఇబ్బందులు తప్పకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆర్మీ ఉద్యోగి పవన్ కుమార్ ప్రశ్నించారు.