గన్నవరంలో వంశీ వర్గీయుల విధ్వంసం... టిడిపి ఆఫీస్ రాళ్ళదాడి, కార్లు ధ్వంసం
గన్నవరం : ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు గన్నవరం టిడిపి కార్యాలయం వద్ద విధ్వంసం సృష్టించారు.
గన్నవరం : ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు గన్నవరం టిడిపి కార్యాలయం వద్ద విధ్వంసం సృష్టించారు. పోలీసుల కళ్లముందే టిడిపి ఆఫీస్ పై దాడిచేసి ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేసారు. గుంపుగా వచ్చిన వంశీ వర్గీయులు పోలీసులను దాటుకుని వెళ్లి టిడిపి కార్యాలయంపై రాళ్లదాడికి దిగారు. అంతటితో ఆగకుండా కార్యాలయంలో లోపలికి వెళ్లి ఫర్నిచర్, కిటికీ అద్దాలు పగలగొట్టారు. ఇక కార్యాలయ ఆవరణలో వున్న ఓ కారుకు నిప్పంటింది మరికొన్ని కార్లపై రాళ్లతో దాడిచేసారు. జై వంశీ అంటూ నినాదాలు చేస్తూ పోలీసులు చూస్తుండగానే టిడిపి కార్యాలయం వద్ద హల్ చల్ చేసారు. ఇక టిడిపి కార్యాలయంపై దాడి గురించి తెలిసి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. పోలీసులు ముందే దాడి జరుగుతుంటే ఏం చేసారంటూ డిఎస్పీ విజయపాల్ రెడ్డిని నిలదీస్తూ ఆయనను టిడిపి శ్రేణులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా జాతీయ రహదారిపై బైఠాయించి టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇలా వైసిపి నాయకుల దాడి, టిడిపి శ్రేణుల ఆందోళనలతో గన్నవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.